వ్యాక్సిన్ల రాకతో కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో కీలక ముందడుగు పడింది. అయితే.. కొత్త కొత్త రూపాలతో కోరలు చాస్తోంది ఈ మహమ్మారి. డెల్టా, డెల్టా ప్లస్ వంటి వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ లక్షల కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 5 లక్షలకుపైగా మందికి వైరస్ సోకింది. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. డెల్టా వేరియంట్ విజృంభణతో రోజుకు లక్ష మందికిపైగా వైరస్ బారినపడుతున్నారు. సోమవారం 1,02,375 కొత్త కేసులు వచ్చాయి. 329 మంది మరణించారు. 46వేల మంది కోలుకున్నారు.
అమెరికా ఆర్కాన్సస్ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతితో రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరారు. ఈ ఏడాది జనవరిలో వైరస్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికన్నా..ప్రస్తుతం ఒక్కరోజులో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,376 మంది ఆసుపత్రులకు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 ఐసీయూ పడకలు మాత్రమే ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 509 మంది ఐసీయూలో ఉండగా.. 286 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న టాప్ 5 దేశాలు..
- ఇరాన్: అగ్రరాజ్యం తర్వాత వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది ఇరాన్‌లోనే. ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వైరస్ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 40వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి 588 మంది మరణించారు. 26వేల మంది వైరస్‌ను జయించారు.
- బ్రిటన్: డెల్టా వేరియంట్ వ్యాప్తి బ్రిటన్‌లో అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజే 25వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 25వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- టర్కీ: దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించిన క్రమంలో వైరస్ మళ్లీ పుంజుకుంటోంది. సోమవారం కొత్తగా 23వేల కేసులు నమోదయ్యాయి. 117 మంది మరణించారు.
- రష్యా: కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. కొత్త కేసులు 20వేల లోపునకు దిగటం లేదు. సోమవారం కొత్తగా 22వేల మందికి వైరస్ సోకింది. 769 మంది మరణించారు.
- ఇండోనేసియా: కరోనా కేసులు అదుపులోకి వచ్చినా.. మరణాలు తగ్గటం లేదు. సోమవారం 20వేల కేసులు వెలుగు చూడగా.. 1,475 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. మరో 44 వేల మంది వైరస్‌ను జయించారు.
ఇదీ చూడండి: డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు- అమెరికాలో లక్షకుపైగా కేసులు