కరోనా వైరస్ వల్ల కొద్ది గంటల్లోనే ఊపిరితిత్తుల కణాలు దెబ్బతింటాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విధ్వంసం తీరుతెన్నులను వారు తొలిసారిగా సవివరంగా ఆవిష్కరించారు. కొవిడ్-19కు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. బోస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
పరిశోధనలో భాగంగా.. పరిశోధకులు ల్యాబ్‌లో వృద్ధిచేసిన లక్షలాది మానవ ఊపిరితిత్తుల కణాలను ఏకకాలంలో కరోనా వైరస్‌తో ఇన్ఫెక్షన్ కలింగించారు."వైరస్ సోకిన గంట తర్వాతి నుంచి ఆ కణాల పరిస్థితిని గమనించాం. ఆ దశలోనే కరోనా హాని కలిగిస్తోందని వెల్లడైంది. ఇది చాలా ఆందోళనకర అంశం" అని పరిశోధనలో భాగస్వామియైన ఎల్కే ముల్బెర్జ్ పేర్కొన్నారు.
విస్తుగొలిపే అంశం..
వైరస్‌కు పునరుత్పత్తి సామర్థ్యం లేదని పరిశోధనల్లో తేలింది. మానవ కణ యంత్రాంగాన్ని హైజాక్ చేయడం ద్వారా తన జన్యు ప్రతులను ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో అది కణ జీవక్రియను మార్చేస్తుందని వెల్లడైంది. ఇన్ఫెక్షన్ సోకిన 3-6 గంటల్లోనే కణంలోని కేంద్రకం చుట్టూ ఉండే పొరను దెబ్బతీస్తోందని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆశ్చర్యానికి గురయ్యారు. "ప్రమాదకరమైన ఎబోలా వైరస్ ఇన్ఫెక్షన్లోనూ ఇంత త్వరగా మార్పులు చోటుచేసుకోలేదు. పైగా ఆ ఇన్ఫెక్షన్ చివరి దశలోనూ కేంద్రక పొర పటిష్ఠంగానే ఉంది." అని ముల్బెర్జర్ చెప్పారు.
ఆ ఔషధాలను కొవిడ్ నివారణకు..
కేంద్రకం చుట్టూ ఉండే పొరలో చాలావరకూ జన్యు సమాచారం ఉంటుంది. సాధారణ కణ విధులను ఇదే నియంత్రిస్తుంది. అది దెబ్బతింటే.. కణాలు చనిపోతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చనిపోతూ.. అవి ప్రమాద సంకేతాలను వెలువరిస్తాయని, దీనివల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని చెప్పారు. తదనంతర జీవప్రక్రియల్లో మరిన్ని కణాలు చనిపోతాయని వివరించారు. అంతిమంగా.. దీనివల్ల నిమోనియా, ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఊపిరితిత్తుల వైఫల్యం చోటు చేసుకుంటాయని వివరించారు. ఇతర రుగ్మతల కోసం ఆమోదం పొందిన 18 ఔషధాలను కొవిడ్‌పై పోరు కోసం మళ్లించొచ్చనీ ఈ పరిశోధనలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
ఇదీ చదవండి: 24గంటల్లోనే పోయిన ముఖాకృతిని పొందొచ్చు!