'అయ్యా! గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోంది' అని పరిశోధకులు ఏడాదిగా మొత్తుకుంటున్న విషయాన్ని... ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు, ఆరోగ్య అధికారులు ఇప్పుడు ధ్రువీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా దీన్ని అంగీకరించింది. గాలిలో వైరస్ తిరిగితే... మహమ్మారి బారి నుంచి ప్రజలను ఎలా రక్షించాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇందుకు శాస్త్రవేత్తలు చెబుతున్నది ఒకటే- ఇంట్లో వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి అని! 'తలుపులు, కిటికీలు బాగా తెరిచి ఉంచాలి. ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావాలి. తద్వారా కరోనాతో పాటు ఫ్లూ, ఇతర శాశ్వకోశ వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి తప్పించుకోవచ్చు' అని పరిశోధకులు సూచిస్తున్నారు. ఒకప్పుడు దుర్గంధపూరిత తాగునీటి పైపుల కారణంగా జనం కలరా బారిన పడ్డారు. దీంతో పైపులైన్ల వ్యవస్థను సరిదిద్దారు. ఇప్పుడు సరిగ్గా అలాగే ఇళ్లలో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా మార్పులు చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విషయమై ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన భూ, వాతావరణ శాస్త్రవేత్త లిదియా మోరావస్కా సారథ్యంలో ఇటీవల పరిశోధన సాగించారు. 14 దేశాలకు చెందిన మొత్తం 39 మంది పరిశోధకులు ఈ క్రతువులో పాల్గొన్నారు. 'తాగునీరు ఎంత స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటామో... మనం పీల్చే గాలి కూడా కాలుష్య రహితంగా, అంటువ్యాధులు సోకడానికి ఆస్కారం లేకుండా ఉండాలి. ఇండోర్ వెంటిలేషన్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని గుర్తించాలి' అని వారు పేర్కొన్నారు. వెంటిలేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను పరిశోధకులు డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో మహమ్మారులను తప్పించుకోవాలంటే...
'కొవిడ్ బాధితులు మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా, చీదినా, పాటలు పాడినా... ముక్కు, నోటి నుంచి గాలి తుంపర్లతో కలిసి వైరస్ బయటకు వస్తుంది. వీటిలో పెద్ద పరిమాణంలోనివి తక్కువ దూరమే ప్రయాణిస్తాయి. చిన్న పరిమాణంలోవి మాత్రం కాస్త దూరంగానే వెళ్తాయి. ఇళ్లలో వెంటిలేషన్ సరిగా లేకపోతే... ఈ తుంపర్లు అక్కడక్కడే తిరగడం, వస్తువులపై నిలవడం ద్వారా మిగతావారికి సోకుతాయి. గాలి వెలుతురు పుష్కలంగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటే మహమ్మారి నుంచి చాలామటుకు తప్పించుకోవచ్చు'అని పరిశోధనకర్త లిదియా చెప్పారు. భవనాల వెంటిలేషన్ విషయంలో మార్పులు తీసుకురావాలని, తద్వారా భవిష్యత్తులో ఇతరత్రా వైరస్‌ల నుంచి ప్రజలను రక్షించే వీలుందని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్- దావోస్ సదస్సు రద్దు