ప్రపంచ దేశాలెన్నింటినో తన కనుసైగలతో శాసించగల అమెరికాను ఓ బుల్లి వైరస్ గడగడలాడిస్తోంది. అగ్రరాజ్య అప్రమత్తతను, ఆరోగ్య వ్యవస్థను వెక్కిరిస్తూ ఆ దేశ పౌరుల నుదుటన మృత్యు శాసనాన్ని రాస్తోంది. కరోనా దెబ్బకు అమెరికాలో మరణించినవారి సంఖ్య తాజాగా లక్ష దాటింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 28 శాతానికిపైగా ఆ ఒక్క దేశంలోనే నమోదయ్యాయి. కేసుల విషయంలోనూ మరే దేశానికీ అందనంత ఎత్తులో అమెరికా ఉంది. ఇప్పటివరకు అక్కడ 17 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్త కేసుల్లో 30 శాతానికిపైగా అగ్రరాజ్యంలోనే నమోదయ్యాయి.
ఆ ఒక్క రాష్ట్రంలోనే...
కొవిడ్ దెబ్బకు అమెరికాలో న్యూయార్క్ ఎక్కువగా కుదేలైంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 29 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. కేసుల్లోనూ అగ్రస్థానం ఆ రాష్ట్రానిదే. అక్కడ 3.7 లక్షల మందికి వైరస్ సోకింది. మహమ్మారి దెబ్బకు న్యూజెర్సీలో 10 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి కరోనా సంక్షోభం మొదలైన తొలినాళ్లలో అమెరికాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కొంత నిర్లిప్తతతో వ్యవహరించింది. వైరస్ విజృంభిస్తున్నా.. లాక్‌డౌన్ వంటి చర్యలు చేపట్టేందుకు మొగ్గుచూపలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకే ట్రంప్ ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఒక్కోరోజు వేలల్లో మరణాలు నమోదయ్యాయి. పరిస్థితులు విషమించడంతో ఎట్టకేలకు జన సంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. ఇటీవల వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించారు.
ఇంకా మొదటి దశలోనే: డబ్ల్యూహెచ్‌ఓ
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తొలి దశ విజృంభణ ఇప్పటికే ముగిసి, రెండో దశ ప్రారంభమైందంటూ వినిపిస్తున్న వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తోసిపుచ్చింది. ‘"మనమిప్పుడు రెండో దశలో లేము. ప్రపంచవ్యాప్తంగా మొదటి దశ విజృంభణ కొనసాగుతోంది. తొలి దశలోనే ఇంకా కేసులు పెరుగుతున్నాయి" అని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జన సంచారంపై నిషేధాజ్ఞలను కొనసాగించాలని బ్రెజిల్‌కు సూచించారు.
మాంద్యం దిశగా సింగపూర్
సింగపూర్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మాంద్యం కరోనా సంక్షోభం కారణంగా తలెత్తే ముప్పుందని నిపుణులు తాజాగా హెచ్చరించారు. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఈ ఏడాది 4-7 శాతం కుంచించుకుపోయే ముప్పుందని వారు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేందుకుగాను ప్రభుత్వం తాజాగా 2,320 కోట్ల అమెరికా డాలర్ల మేరకు అదనపు బడ్జెట్‌ను ప్రకటించింది. సింగపూర్‌లో ఇప్పటివరకు 32,243 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
- బ్రెజిల్‌లో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 3.7 లక్షలపైకి ఎగబాకింది. మరణాలు 23 వేలు దాటాయి.
- రష్యాలో తాజాగా 24 గంటల్లో 174 మంది కరోనా తీవ్రతకు మృత్యువాతపడ్డారు. ఆ దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో చోటుచేసుకున్న అత్యధిక మరణాలివే. దాదాపు 9 వేల కొత్త కేసులు నమోదవడంతో రష్యాలో మొత్తం బాధితుల సంఖ్య 3.6 లక్షలు దాటింది.
పాక్‌కు అమెరికా సాయం
కరోనాపై పోరాడడానికి పాకిస్థాన్‌కు 60 లక్షల డాలర్లు (సుమారు రూ.45 కోట్లు) సాయంగా అందించాలని అమెరికా నిర్ణయించింది. పాక్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన అమెరికా రాయబారి పాల్ జోన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా బాధితులకు, ఆసుపత్రుల్లో సేవలందించే వైద్య సిబ్బంది శిక్షణకు, హాట్‌స్పాట్లలో ఉంటున్న వారికి ఈ సాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. దీంతో కలిపి తాము 2.10 కోట్ల డాలర్ల సాయాన్ని పాక్‌కు ప్రకటించామన్నారు.