ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా కేసులు 12 లక్షల 87 వేలు దాటగా, మృతుల సంఖ్య 70 వేలు మించింది. మరో వైపు 2 లక్షల 71 వేలకి పైగా కరోనా బాధితులు కోలుకోవడం ఊరట కలిగిస్తోంది.
ఐరోపాలో మృత్యు ఘోష
కరోనా మహమ్మారి మృత్యు కౌగిలిలో ఐరోపా దేశాలు నలిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 6,75 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. 50 వేలకుపైగా మృత్యువాతపడ్డారు.
స్పెయిన్: స్పెయిన్‌లో ఈ ఒక్క రోజే 414 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 13,055కు చేరుకుంది. అక్కడ కొత్తగా 3,386 కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1,35,032కు చేరుకుంది. అయితే అక్కడ క్రమంగా కరోనా మరణాలు తగ్గుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
బెల్జియం, నెదర్లాండ్స్: బెల్జియంలో ఈ ఒక్క రోజే 185 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 1,632కు పెరిగింది. నెదర్లాండ్స్‌లో చనిపోయిన వారి సంఖ్య 1,766కు చేరింది. మరోవైపు జర్మనీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా.... మృతుల సంఖ్య 1,584కు చేరింది.
ఇటలీ: మృతుల సంఖ్య 15,877కు చేరింది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య లక్షా 30 వేలకు చేరువైంది.
బ్రిటన్: మొత్తం మృతుల సంఖ్య 4,934... కాగా కరోనా కేసుల సంఖ్య 47,800 దాటింది. కరోనా లక్షణాలు బయటపడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆసుపత్రికి తరలించారు.
ఫ్రాన్స్: వైరస్ సోకి ఇప్పటి వరకు దేశంలో 8,078 మంది మరణించగా... కేసుల సంఖ్య 92,800 దాటింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంతగా నష్టపోయిన ఫ్రాన్స్... ఆర్థిక మాంద్యం దిశగా కొనసాగుతోందని ఆ దేశ ఆర్థికమంత్రి ప్రకటించడం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో తెలుపుతుంది.
ఆసియా దేశాల్లో కరోనా బీభత్సం
ఇరాన్: ఇరాన్లో ఈ ఒక్క రోజే 136 మంది కరోనాతో ప్రాణాలువిడిచారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 3,739కి చేరుకుంది. కాగా అక్కడ 2,274 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం సంఖ్య 60,500కు చేరుకుంది.
పాకిస్థాన్‌లో..
పాకిస్థాన్‌లో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 3,277కు చేరుకుంది. అయితే లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి మందగించిందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ అంటువ్యాధితో ఇప్పటివరకు దాయాది దేశంలో 50 మంది మరణించగా... 257 మంది కోలుకున్నారని పాక్ జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వశాఖ పేర్కొంది.
జపాన్‌లో అత్యవసర పరిస్థితి?
జపాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 3,600 దాటిన నేపథ్యంలో.. ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలని షింజో అబే ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనగా 108 ట్రిలియన్ యెన్ల ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది.
దిక్కుతోచని స్థితిలో అమెరికా
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మృత్యు తాండవం చేస్తోంది. ప్రస్తుతం అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 36 వేలు దాటింది. మృతుల సంఖ్య 10 వేలకు చేరువైంది. ఒక్క న్యూయార్క్‌లోనే ఒక లక్షా 23 వేల మంది కరోనా సోకగా... 4,150 మంది మరణించారు.
9/11 దాడి, పెర్ల్ హార్బర్ ఘటనల తరువాత అమెరికాను అంతగా నష్టపరిచింది ఈ కరోనానే. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడాలని అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే... ఈ విషాదం ఇంకా కొనసాగే అవకాశముందని ఓ ఉన్నత వైద్యుడు చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇదీ చూడండి: కరోనా ఎక్కడ, ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా?