కంప్యూటర్ సాయంతో రూపొందించిన కృత్రిమ యాంటీవైరల్ ప్రొటీన్లు కరోనా వైరస్ నుంచి మెరుగ్గా రక్షణ కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రయోగశాలలో వృద్ధి చేసిన మానవ కణాలను ఇవి వైరస్ బారి నుంచి రక్షించాయని తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్ ఉపరితలంపై కొమ్ముల్లాంటి స్పైక్ ప్రొటీన్లు ఉంటాయి మానవ కణాలతో సంధానం కావడంలో అవి సాయపడతాయి. ఫలితంగా కణంలోకి వైరస్ ప్రవేశించి, ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది.
ఈ ప్రక్రియను లక్ష్యంగా చేసుకునే ఔషధాల ద్వారా కొవిడ్-19 కు చికిత్స చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మహమ్మారి నివారణకూ అవి ఉపయోగపడతాయన్నారు. కరోనా వైరలోని స్పైక్ ప్రొటీన్లను పటిష్ఠంగా బంధించి, మానవ కణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త ప్రొటీన్లను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కంప్యూటర్లను ఉపయోగించారు. ఈ పద్ధతిలో 20 లక్షలకు పైగా ప్రొటీన్లను డిజైన్ చేశారు. వాటిలో 1.18 లక్షల ప్రొటీన్లను ల్యాబ్లో ఉత్పత్తి చేసి, పరీక్షించారు. వీటిపై విస్తృతంగా క్లినికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.