విస్కాన్సిన్ రాష్ట్రంలోని రెండు కౌంటీల్లో చేపట్టిన రీకౌంటింగ్ ఆదివారం పూర్తయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ అభ్యర్థి విజయాన్ని రీకౌంటింగ్ ఫలితాలు నిర్ధరించాయి. ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
రాష్ట్ర రాజధాని మాడిసన్‌తో కూడిన డేన్ కౌంటీలో నిర్వహించిన రీకౌంటింగ్లోని మొత్తం ఓట్లలో చిన్న మార్పులు ఉన్నట్లు పేర్కొన్నారు అధికారులు. డేన్ కౌంటీలో ఈసారి ట్రంప్‌కు 45 ఓట్లు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. మరోవైపు.. మిల్వాకీ కౌంటీలో గతంలోని ఫలితాలే ప్రతిబింబించినట్లు చెప్పారు. మిల్వాకీలో బైడెన్‌కు 132 ఓట్లు అధికంగా వచ్చయన్నారు.
డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ సుమారు 20,600 ఓట్ల మెజారిటీతో ట్రంప్‌పై విజయం సాధించారు. మిల్వాకీ, డేన్ కౌంటీల్లో ఇరువురి మధ్య మార్జిన్ 2 టూ 1 గా ఉంది.
" మేం చెప్పినట్లుగానే విస్కాన్సిన్లో జో బైడెన్ విజయాన్ని నిర్ధరించటానికి మాత్రమే ఈ రీకౌంటింగ్ ఉపయోగపడింది" అని పేర్కొన్నారు బైడెన్ మద్దతుదారు డానియల్ మెల్ఫీ. అయితే.. ఈ రీకౌంటింగ్ ఫలితాలపై ట్రంప్ బృందం స్పందించలేదు. దీనిపై అధ్యక్షుడు తదిపరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
మంగళవారం తుది గడువు..
ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు మంగళవారం నాటికే గడువు ఉన్నందున అధ్యక్షుడు ట్రంప్ బృందం త్వరితగతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఫలితాలను విస్కాన్సిన్ ఎన్నికల సంఘం డెమొక్రటిక్ అధికారి ధ్రువీకరిస్తారు. అయితే.. ఫలితాల నిర్ధరణను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా ఇప్పటికే వ్యాజ్యం దాఖలు చేశారు విస్కాన్సిన్ ఓటర్ల సంఘం సభ్యులు.
ఇదీ చూడండి:'బైడెన్ నంబర్ వన్ అధ్యక్షుడు అవుతారు'