కరోనాపై పోరులో భాగంగా ఆయుర్వేద ఫార్ములేషన్ల కోసం భారత్-అమెరికా సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నాయి. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు వెల్లడించారు. ఇరు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, వైద్యులతో వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో ఇలా వ్యాఖ్యానించారు.
"కరోనాపై పోరులో భాగంగా.. ఇరు దేశాల శాస్త్రవేత్తల సంఘాలు కలిసి పనిచేయడానికి వీలు కలిగింది. సంయుక్త పరిశోధనలు, బోధన, శిక్షణ కార్యక్రమాలతో ఇరు దేశాల వ్యవస్థలు ఆయుర్వేదాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఆయుర్వేదాన్ని అనుసరించేవారు, పరిశోధకులు కలిసి ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు సంప్రదింపులు జరుపుతున్నారు. జ్ఞానం, పరిశోధనకు సంబంధించిన వనరులను ఇచ్చిపుచ్చుకుంటున్నారు."
--- తరంజిత్ సింగ్ సంధు, అమెరికాలోని భారత రాయబారి.
ఈ సంయుక్త పరిశోధనలకు ఇండో-అమెరికా సైన్స్ టెక్నాలజీ ఫోరమ్(ఐయూఎస్ఎస్టీఎఫ్) మద్దతు పలికింది.
ఆరోగ్య రంగంపై భారత్-అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా సహకారం ఉందని సంధు తెలిపారు. అనేక వ్యాధులను సాధారణ, క్లినికల్ స్థాయిలో అర్థం చేసుకునేందుకు.. ఇరు దేశాల శాస్త్రవేత్తలు కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు.
ప్రస్తుతం అమెరికా ఆధారిత సంస్థలతో మూడు భారత వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని సంధు వెల్లడించారు. దీని వల్ల కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇరు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లబ్ధిపొందుతారన్నారు.
ఇదీ చూడండి:- కరోనాను ఖతం చేసే యంత్రం ఆవిష్కరణ!