ఇరుగుపొరుగు దేశాలపై చైనా ప్రదర్శిస్తున్న దూకుడు... చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ ఆలోచనా విధానం ఎలా ఉందన్న దానిపై మంచి అవగాహన ఇస్తోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ వ్యాఖ్యానించారు.
"భారత్‌కు వ్యతిరేకంగా తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద చైనా ఘర్షణకు దిగింది. భారతీయ సైనికులపై దాడికి పాల్పడింది. అలాగే దక్షిణ చైనా సముద్రంపై, అందులోని ద్వీపాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను హరించింది. ఇవన్నీ.. ఈ రోజుల్లో అధికార చైనా కమ్యునిస్టు పార్టీ(సీపీసీ) ఎలా ఆలోచిస్తోందన్న దానిపై, 'మంచి అవగాహన' కల్పిస్తున్నాయి."
- రాబర్ట్ ఓబ్రెయిన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు
చైనా దురాక్రమణవాదం
ఫాక్స్ న్యూ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన రాబర్డ్ ఓబ్రెయిన్.. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
"తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారతీయ సైనికులపై చైనా బలగాలు దాడి చేశాయి. ఇనుప రాడ్లు, ముళ్ల తీగలు చుట్టిన కర్రలతో దారుణంగా కొట్టారు చైనీయులు. ఈ దాడిలో సుమారు 20 మంది భారత జవానులు అమరులయ్యారు. దీని ద్వారా చైనా తనేంటో చెప్పకనే చెప్పింది."
-రాబర్ట్ ఓబ్రెయిన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు
భారత్ - యూఎస్ మిత్రదేశం
భారత్, అమెరికా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు.. 'భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు గొప్ప మిత్రదేశం. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి' అని రాబర్ట్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చైనాకు ట్రంప్ షాక్- 'హాంకాంగ్' చట్టంపై సంతకం