హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని... అమెరికా ఆదేశించినట్లు చైనా తెలిపింది. ఇది దారుణమైన, అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తీసుకున్న ఈ దుందుడుకు నిర్ణయం వల్ల... యూఎస్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని బీజింగ్ హెచ్చరించింది.
"హ్యూస్టన్‌లోని మా కాన్సులేట్‌ను ఇంత (72 గంటల్లోగా) తక్కువ వ్యవధిలో మూసివేయాలని అమెరికా ఆదేశించింది. ఇది చాలా దారుణం, అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే... చైనా నుంచి అంతే స్థాయిలో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు."
- వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
నివురుగప్పిన నిప్పులా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య చాలా కాలంగా రాజకీయంగా, వాణిజ్యపరంగా వైషమ్యాలు కొనసాగుతున్నాయి. ఫలితంగానే అమెరికా... చైనా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే చైనా తాజా ప్రకటనపై అమెరికా నుంచి ఎలాంటి స్పందన కానీ, వివరణ కానీ రాలేదు.
కాన్సులేట్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించినట్లు వచ్చిన వార్తలపై అధికారులు స్పందించారు. కొంతమంది వ్యక్తులు చెత్త డబ్బాల్లోని కాగితాలను మాత్రమే కాల్చివేశారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పరిస్థితులు మరింత క్షీణిస్తాయ్!: ట్రంప్