హిమాలయ పర్వతాల ప్రాంత సరిహద్దుల్లో చైనా దురాక్రమణ (China Expansionism) చర్యలకు పాల్పడుతూనే ఉందని అగ్రరాజ్యం అమెరికా (China US news) మరోసారి వెల్లడించింది. అమెరికాతో పాటు మిత్రదేశాలపైనా చైనా దాడులకు దిగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. వీటితోపాటు పలు అంశాల్లో అంతర్జాతీయ నిబంధనలను పాటించని చైనా ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాల్సిందేనని అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు నామినేట్ చేసిన ఈ దౌత్యవేత్త (US ambassador to China).. త్వరలోనే చైనాకు తదుపరి రాయబారిగా వెళ్లనున్నారు. అయితే, భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చైనాదే బాధ్యత..
చైనా తదుపరి రాయబారిగా నియమితులైన సందర్భంగా అమెరికా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ముందు నికోలస్ బర్న్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చైనా వ్యవహారశైలిని మరోసారి తప్పుబట్టారు. ముఖ్యంగా భారత్‌పై చైనా దురాక్రమణ (China India border dispute) కొనసాగిస్తూనే ఉందన్నారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్, మరో పక్క జపాన్, ఆస్ట్రేలియా, లిథువేనియా దేశాలపైనా బెదిరింపు చర్యలను చైనా మొదలుపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అమెరికా ప్రయోజనాలకు, విలువలకు వ్యతిరేకంగా చైనా చర్యలతోపాటు అమెరికా, దాని మిత్ర దేశాల భద్రతకు ముప్పు వాటిల్లే అంశాలు, అంతర్జాతీయ ఆదేశాలను ఖాతరు చేయకపోవడం వంటి అంశాల్లో అవసరమైన చోట తప్పకుండా చైనాకు సవాలుగా అమెరికా నిలుస్తుందని స్పష్టం చేశారు.
మిత్ర దేశాలకు అండగా..
షిన్‌జియాంగ్ ప్రాంతంలోనూ చైనా మారణహోమానికి పాల్పడడంతోపాటు.. టిబెట్‌పైనా వేధింపులకు దిగుతోంది. అటు హాంగ్‌కాంగ్ స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛను హరిస్తోన్న చైనా.. తైవాన్‌పై బెదిరింపు చర్యలను తీవ్రం చేసింది. వీటన్నింటిని వెంటనే ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని నికోలస్ బర్న్స్ అభిప్రాయపడ్డారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, యథాతథ స్థితిని దెబ్బతీసే ఏకపక్ష చర్యలనూ అమెరికా వ్యతిరేకిస్తుందని చట్టసభ సభ్యులకు స్పష్టం చేశారు. ఏవైనా వివాదాలుంటే శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అమెరికా మద్దతు తెలుపుతుందన్నారు. వీటితోపాటే ఉద్యోగాలు, ఆర్థికవ్యవస్థ, మౌలిక సదుపాయాలు, నూతన సాంకేతికతలో చైనాకు అమెరికా గట్టి పోటీ ఇస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సైనిక, ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలని చైనా కోరుకుంటున్నట్లు అమెరికా దౌత్యవేత్త నికోలస్ అంచనా వేశారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన మిత్ర దేశాలకు మద్దతుగా నిలవాల్సి ఉందని అమెరికా చట్టసభ సభ్యులను కోరారు.
ఇదిలాఉంటే, భారత సరిహద్దుల్లో భారీ స్థాయిలో చైనా తన బలగాలను మోహరిస్తోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సరిహద్దు అంశంపై ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 13సార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఫలితం ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో చైనా ఆక్రమణలపై అమెరికా దౌత్యవేత్త ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: ఉత్తర కొరియాపై ఆంక్షలకు అమెరికా, ఐరోపా డిమాండ్