చిలీలో చెలరేగుతున్న నిరసనలకు ముగింపు పలికే దిశగా ఆ దేశ అధ్యక్షుడు ముందడుగేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిస్తూ, సంబంధిత ఉత్తర్వులపై సంతకాలు చేశారు సెబాస్టియన్ పినేరా. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రాజ్యాంగ సవరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
చిలీలోని శాంటియాగోలో రవాణా ఛార్జీల పెంపుపై అక్టోబర్ 18 నుంచి నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా ఆందోళనకారులు 188 పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. ఈ అల్లర్లలో 2,210 మంది పోలీసులు గాయపడ్డారు. 971 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. చారిత్రక సెంట్రో ఆర్టే ఆల్మెడ సినిమా థియేటర్‌కు నిప్పంటించారు.
నిరసనలను అదుపు చేసేందుకు ఆందోళనకారులపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలమందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసుల దురాఘాతాలకు సంబంధించి ఐరాస మానవ హక్కుల కమిషన్ నిజనిర్ధరణ కమిటీ వేసింది. మూడు వారాల విచారణ అనంతరం ఈ కమిటీ యూఎన్హెచ్ఆర్సీకి నివేదిక సమర్పించింది.
ఇదీ చూడండి: వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!