ప్రపంచదేశాలను కరోనా కలవరపెడుతోన్న వేళ.. ఓ శతాధిక వృద్ధురాలు అలవోకగా వైరస్‌ను జయించింది. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్ ఫ్లూ విజృంభణ సమయంలోనే ఆమె జన్మించడం గమనార్హం. అలా... రెండు మహమ్మారులను తట్టుకొని జీవించిన మహిళగా నిలిచింది అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఏంజెలినా ఫ్రైడ్‌మ్యాన్.
లేక్ మోహీగన్ సమీపంలోని నర్సింగ్ హోంలో ఉండే ఏంజెలినా.. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం మార్చి 21న ఆసుపత్రిలో చేరింది. అయితే.. పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం.. అక్కడే ఉండి వైద్యం తీసుకుంది.
క్యాన్సర్‌పైనా పోరాడి...
చికిత్స సమయంలో అడపాదడపా జ్వరం భయపెట్టినా చివరకు ఏప్రిల్ 20న నిర్వహించిన పరీక్షల్లో ఫలితం నెగటివ్‌గా వచ్చింది. ఈ బామ్మ ప్రాణాంతక క్యాన్సర్‌నూ అధిగమించడం విశేషం.
ఏంజెలినా కొవిడ్ నుంచి కోలుకోవడంపై ఆమె కుమార్తె సంతోషం వ్యక్తం చేసింది. తన తల్లిని పోరాటయోధురాలిగా అభివర్ణించింది.
పుట్టగానే తల్లి మరణం..
స్పానిష్ ఫ్లూ విజృంభిస్తున్న సమయంలోనే అత్యంత ప్రతికూల పరిస్థితుల నడుమ ఏంజెలినా పుట్టింది. ఇటలీ నుంచి న్యూయార్క్‌కు వలస వెళ్తూ పడవలో బిడ్డను ప్రసవించి మరణించింది ఆమె తల్లి.
1918-20 సమయంలో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని గజగజ వణికించింది. 5 కోట్ల మంది ఈ మహమ్మారి సోకి బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి: అప్పుడు స్పానిష్ఫ్లూ.. ఇప్పుడు కరోనాను జయించిన బామ్మ!