అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు చెలరేగిపోతోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఉత్తర శాన్ఫ్రాన్సిస్కో, సొనోమా ప్రాంతాల్లో గత వారం మొదలైన దావానలం 267 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇప్పటివరకు దాదాపు 96 భవనాలు మంటల్లో కాలిపోయాయి. మరో 80 వేల ఇళ్లకు ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్లోనూ సోమవారం కార్చిచ్చు విజృంభించింది. మంటలు భీకరంగా వ్యాపించడం వల్ల వేలాది ఇళ్లు ప్రమాదం అంచున నిలిచాయి. సమీప ప్రాంతాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
విద్యుత్తు నిలిపివేత
పలు నగరాల్లో మంటలు వ్యాపించడం వల్ల కాలిఫోర్నియాకు విద్యుత్ సరఫరా అందించే అతి పెద్ద సంస్థ 'పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్' విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా సుమారు 25 లక్షల మందికి పైగా ప్రజల జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.
ఇదీ చూడండి:ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి: ఈయూ బృందంతో మోదీ