కరోనా మహమ్మారి ప్రబలిన దేశాలు ఇప్పుడు వైద్య సాయాన్ని అర్థిస్తున్నాయి. ఈ విజ్ఞప్తికి సుసంపన్న దేశాలు స్పందించకపోయినా.. బుల్లిదేశం క్యూబా ధైర్యంగా ముందుకొచ్చి.. కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలకు వైద్యబృందాల్ని పంపుతోంది. చైనాలోని వుహాన్‌కూ డాక్టర్లను పంపింది. యాంటీ వైరల్ చికిత్సలు అందించడం, తమ దేశంలోనే పెద్దఎత్తున మాస్కుల తయారీ ద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో ప్రపంచ దేశాలకు క్యూబా ఆదర్శంగా నిలుస్తోంది.
వైద్యులకు పెట్టింది పేరు
కొన్ని దశాబ్దాల కిందట క్యూబాలో వచ్చిన అంటువ్యాధికి అనేకమంది బలయ్యారు. ఏ దేశమూ దీనికి వైద్య సాయం అందివ్వలేదు. దీంతో క్యూబా కమ్యూనిస్టు దిగ్గజం ఫిడెల్ క్యాస్ట్రో తమ దేశంలోనే పెద్దఎత్తున వైద్యుల్ని తయారుచేయాలని నిశ్చయించి.. దేశాన్ని డాక్టర్ల ఉత్పత్తి ఫ్యాక్టరీగా మలచారు. క్యూబాలో ప్రస్తుతం ప్రతి 1000 మందికి 8.2 మంది డాక్టర్లున్నారు.
తక్షణ స్పందన
చైనాలోని వుహాన్‌లో కరోనా మహమ్మారి వెలుగుచూసిన వెంటనే.. అక్కడికి డాక్టర్లను, తమ దేశంలో తయారైన కొన్ని మందుల్నీ క్యూబా పంపింది. దీనివల్ల చాలా మంది రోగులకు వ్యాధి నయమైందని క్యూబా ప్రకటించింది. వైద్య సాయం అర్థించిన వెంటనే ఇటలీకి నిపుణులైన డాక్టర్లను పంపి.. రోగుల ప్రాణాలే ముఖ్యమన్న క్యాస్ట్రో మాటల్ని తూచ తప్పకుండా పాటించింది. ఇప్పుడు స్పెయిన్, నికరగవాకూ డాక్టర్లను పంపడానికి సిద్ధమయింది. క్యూబాలో ఇప్పటిదాకా 57 కరోనా కేసులే వెలుగుచూశాయి. ఒకరు మరణించారు. దేశంలోని పౌర, సైనిక ఆసుపత్రులు అన్నింటిలోనూ కరోనా రోగులకు చికిత్స అందించడానికి క్యూబా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
'మాస్కులు' తొలగించే నిజాలు
అమెరికాలో వైద్యులు, సిబ్బందికి మాస్కుల కొరత రాకుండా ఉండేందుకు అక్కడి అధికారులు దారుణమైన ఎత్తుగడ వేశారు. మాస్కులు పెద్దగా ఉపయోగపడవని, వాటిని సరిగ్గా వాడకపోతే మరింత ప్రమాదమంటూ ప్రచారం చేశారు. పైగా సరిగ్గా ఎలా వాడాలో చెప్పలేదు. కానీ అమెరికన్లు వీటిని విపరీతంగా కొన్నారు. ఫలితంగా దేశంలో పెద్దఎత్తున మాస్కుల కొరత ఏర్పడింది. క్యూబాలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. అధికారులు... పాఠశాలల యూనిఫాంలు కుట్టే ప్రభుత్వ ఫ్యాక్టరీలకు మాస్కులు తయారుచేసే బాధ్యతను అప్పగించారు. పెద్దఎత్తున మాస్కుల్ని తయారుచేసి.. అమెరికా, ఇటలీలకు పంపుతున్నారు.
విపత్తు పీడిత దేశాల్లో సేవలు
ప్రపంచంలో ఎక్కడ విపత్తులు సంభవించినా.. మానవతా వాదానికి ప్రాధాన్యమిచ్చే క్యూబా పీడిత ప్రజల్ని కాపాడేందుకు నిత్యం ముందుంటుంది. 2010లో హైతీ భూకంప బాధితులకు, 2014లో ఎబోలా కోరల్లో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా ప్రజలకు క్యూబా అండగా నిలిచింది. జార్జిబుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాపై కత్రినా హరికేన్ విరుచుకుపడినప్పుడు సైతం క్యూబా ఆపన్నహస్తం అందించగా.. నాటి అధికారులు నిరాకరించారు. వైద్య సదుపాయాల లేమితో బాధపడుతున్న బ్రెజిల్‌లో క్యూబా వైద్యులు ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఇప్పుడూ క్యూబా సాయాన్ని బ్రెజిల్ అర్థిస్తోంది. 1960ల నుంచి క్యూబా డాక్టర్లు, స్పెషలిస్టులు డజన్లకొద్దీ వర్ధమాన దేశాల్లో సేవలు అందిస్తున్నారు. దాదాపు 77 దేశాల్లో 37,000 మంది క్యూబా డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లో వైద్య సేవలు క్యూబాకు పెద్దఎత్తున ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. 2018లో క్యూబా విదేశీ ఆదాయాల్లో దాదాపు 43% వైద్య సేవలదే.
ఓడనూ అనుమతించింది
గతవారం బ్రిటన్ నుంచి 682 మంది ప్రయాణికులతో బయలుదేరిన 'ఎంఎస్ బ్రాయిమార్' నౌకలో ఐదుగురు ప్రయాణికులకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మరికొందరు ప్రయాణికుల్లోనూ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. కరీబియన్ దీవుల గుండా వచ్చిన ఈ నౌకను నిలపడానికి ఏ దేశమూ అంగీకరించలేదు. కానీ క్యూబా ధైర్యంగా ముందుకొచ్చింది. తమదేశంలోని మరియల్ రేవులో ఓడకు లంగరు వేయడానికి సమ్మతించింది. వీరివల్ల దేశంలో కరోనా కేసులు పెరగొచ్చొన్న ఆందోళనల్నీ లెక్కచేయలేదు. నౌకలో కరోనా సోకిన వారిని తమ దేశంలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించింది.
ఇదీ చదవండి: కరోనా కోరల్లో అమెరికా.. లక్ష దాటిన కేసులు