చంద్రునిపై మానవుడు కాలుపెట్టి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హ్యూస్టన్ అంతరిక్ష కేంద్రంలో సంబరాలు చేస్తున్నారు. ఇది మామూలు వేడుక కాదు.. వ్యాపార సంబంధమయింది. అప్పటి యాత్రను ప్రతిబింబించే వస్తువులను అమ్మకానికి పెట్టి లాభాలను అర్జిస్తున్నాయి ప్రముఖ కంపెనీలు.
చంద్రునిపై యాత్ర థీమ్‌తో తయారు చేసిన గడియారాలు, బిస్సట్స్, పానీయాలు, తినుబండారాలు, టీ-షర్ట్స్ చూపరుల మనసు దోచుకుంటున్నాయి. అద్భుత ఘట్టానికి కారణమైన అంతరిక్ష నౌక అపోలో-11 ఇందులో ప్రముఖంగా కనిపిస్తుంది.
"అపోలోకు సంబంధించిన జాకెట్స్ ఎన్నో ఉన్నాయి. అందులో చాలా వరకు టీ-షర్ట్స్, మిషన్ ప్యాచ్‌లు ఉన్నాయి. నేను మాత్రం ఈ లేపల్ పిన్ (కోటు కాలర్ భాగంలో ధరించేది) తీసుకున్నా. ఎన్నో పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. అపోలో అనే పేరు ఉంటే చాలు.. అవే ఇక్కడ హాట్ కేకులు."
-ట్రేసీ లామ్, హ్యూస్టన్ అంతరిక్ష కేంద్రం సీఓఓ
చంద్రుడిపై కాలు మోపిన చరిత్రకు సంబంధించి ఎలాంటి వస్తువైనా సందర్శకులు ఎగబడి కొంటున్నారు. ఆనాటి స్మృతులు గుర్తుండేలా వీటిని తమ సొంతం చేసుకోవాలని ఉత్సాహపడుతున్నారు.
"మీకు తెలుసా? ఆ రోజుల్లో పైలట్, వ్యోమగామి కావాలంటే చాలా పెద్ద విషయం. అప్పట్లో స్పేస్ షటిల్ ప్రయోగాలు టీవీల్లో వస్తే పనిగట్టుకుని చూసేవాళ్లం. అదో చిన్ననాటి అనుభూతిలా మిగిలిపోయింది."
-కెన్ కుహన్, సందర్శకుడు, టెక్సాస్
లెగో.. ప్రఖ్యాత థీమ్ వస్తు ఉత్పత్తులకు పెట్టింది పేరు. స్టార్ వార్స్, హ్యారీ పోటర్ నేపథ్యంలో ఎన్నో రూపకల్పనలు చేసింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి మరికొన్ని రూపకల్పనలకు సిద్ధమయింది.
"కొన్నేళ్లుగా పిల్లలు, పెద్దలకు అంతరిక్షంపై ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటోంది. అందుకే మేం అంతరిక్ష నేపథ్యానికి సంబంధించి వివిధ వస్తువులను రూపొందిస్తున్నాం. ఇవి మన పిల్లలకు స్ఫూర్తినిస్తాయి."
-కెల్సీ హిల్టన్, లెగో అధికార ప్రతినిధి
1969, జులై 20న చంద్రునిపై అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కాలు మోపారు. అప్పటి కంపెనీలు కూడా తమ సేవలను గుర్తు చేసుకుంటూ వేడుకలు చేసుకుంటున్నాయి. ఒమెగా అనే కంపెనీ తయారు చేసిన 'స్పీడ్ మాస్టర్' గడియారాన్ని చంద్రునిపై బజ్ ఆల్డ్రిన్ ధరించారు.
ఇదీ చూడండి: ఆరు నెలల తర్వాత భూమి మీద కాలుమోపారు!