కరోనా ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. బ్రెజిల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికా, రష్యా, పాక్ దేశాల్లో వైరస్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు 1.55 కోట్లకు చేరువలో ఉన్నాయి.
బ్రెజిల్లో తీవ్రం..
బ్రెజిల్‌ను కరోనా అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే వైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఆ దేశంలో కొత్తగా రికార్డ్ స్థాయిలో 67,860 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితులు 22 లక్షల పైకి ఎగబాకింది. 82,700 మంది కొవిడ్‌తో మరణించారు.
అగ్రరాజ్యంలో ఆగని కేసులు
అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 21,797మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 4,122,672కు పెరిగింది. మరో 364 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 146,547కి చేరింది.
మెక్సికోలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా 6,019మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 362,274కు పెరిగింది. మరో 790మంది కొవిడ్‌తో మరణించగా.. మృతుల సంఖ్య 41,190కు చేరింది.
5 వేలకు పైగా..
కరోనా కేసుల్లో రష్యా ప్రపంచంలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో మరో 5,848 మంది వైరస్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,95,038కు పెరిగింది. 147మంది వైరస్‌తో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 12,892కు ఎగబాకింది.
ఇతర దేశాల్లో ఇలా..
- పాక్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 1,763 మందికి వైరస్ సోకింది. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,69,191కు చేరగా.. మృతుల సంఖ్య 5,709కు పెరిగింది.
- ఆస్ట్రేలియాలో కొత్తగా 423 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో ఐదుగురు చనిపోయారు.
- నేపాల్‌లో మరో 147మంది వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18,241కు పెరిగింది.
- దక్షిణ కొరియాలో తాజాగా 59కేసులు బయటపడ్డాయి.
- చైనాలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 18 మందికి వైరస్ సోకింది.
ఇదీ చూడండి: 'అమెరికాలో మరిన్ని చైనా కాన్సులేట్‌లు బంద్'