అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తూ భీకరంగా మారుతోంది. ఇప్పటికే వేల ఎకరాల్లోని అరణ్యాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.
కార్చిచ్చుపై యుద్ధం..
అమెజాన్ అడవుల్లో అంతకంతకూ పెరిగిపోతున్న కార్చిచ్చును ఆపేందుకు సైన్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్లు బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో ప్రకటించారు. అధ్యక్ష ఉత్తర్వులు ప్రకారం... శనివారం నుంచి బ్రెజిల్ దళాలను కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో మోహరిస్తారు.
నిరసనలు
అమెజాన్ కార్చిచ్చు సెగ ఆ దేశ ప్రభుత్వానికి తాకింది. బ్రెజిల్ రాజధాని రియో-డీజెనీరోలో వేలాది మంది గుమిగూడి అధ్యక్షునికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అమెజాన్ అరణ్యాలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాసటగా ఉంటాం...
బ్రెజిల్‌కు బాసటగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బొల్సొనారోతో మాట్లాడిన ఆయన.. కార్చిచ్చు అదుపులోకి తీసుకొచ్చేందుకు బ్రెజిల్‌కు అమెరికా పూర్తి సహకాం అందిస్తుందని స్పష్టం చేశారు.
"అమెరికా-బ్రెజిల్... భవిష్యత్ వాణిజ్య అవకాశాలు బాగున్నాయి. మా సంబంధం బలంగా ఉంది. అమెజాన్ అరణ్యాల్లో వ్యాపిస్తున్న కార్చిచ్చును అదుపు చేయడంలో... బ్రెజిల్‌కు అమెరికా సహాయం చేస్తుందని బొల్సొనారోకు తెలిపాను." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
లాటిన్ అమెరికా అంతటా
లాటిన్ అమెరికా అంతటా కార్చిచ్చు వ్యాపిస్తోంది. లక్షలాది ఎకరాల్లో అరణ్యాలు నాశనమవుతున్నాయి. మూగజీవాలు ప్రాణాలను, ఆవాసాలను కోల్పోతున్నాయి. ప్రజావాసాలు, నగరాలు పొగబారుతున్నాయి. ప్రజలు ఊపిరిపీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భూగోళానికి 20 శాతం వరకు జీవవాయువు అందిస్తున్న అమెజాన్ అరణ్యాలు కళ్లెదుటే బూడిదవుతున్నాయి.
ఇదీ చూడండి: మాంద్యానికి 'సీతమ్మ మందు'తో లాభాలివే!