బ్రెజిల్ అధ్యక్షుడి నోట భారత ఇతిహాసమైన రామాయణం ప్రస్తావన వచ్చింది. మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు బొల్సోనారో రామాయణాన్ని ప్రస్తావించారు.
పురాణ పురుషుడు రాముడి సోదరుడు లక్ష్మణుడిని రక్షించడం కోసం హనుమంతుడు హిమాలయాల నుంచి ఔషధాన్ని తీసుకువచ్చాడని... అనారోగ్యంతో బాధపడుతున్నవారిని జీసస్ స్వస్థపరిచాడని... అలాగే ప్రజల రక్షణార్థం కరోనా కట్టడికి మనం కలిసి పనిచేద్దామని ఆయన మోదీకి లేఖ రాశారు.
ఇప్పటికి సుమారు 30 దేశాలు ఈ ఔషదం కోసం భారత్‌కు అభ్యర్థనలు పంపాయి. ఇప్పుడు ఆ జాబితాలో బ్రెజిల్ కూడా చేరింది. కరోనాపై పోరులో తమకు సాధ్యమైన మేరకు సహకారం అందిస్తామని బ్రెజిల్ అధినేతకు మోదీ హామీ ఇచ్చారు.
ఈ డ్రగ్ ప్రత్యేకతేంటి?
కొవిడ్-19 బాధితులకు చికిత్స నిర్వహించడానికి హైడ్రోక్సీక్లోరోక్విన్ డ్రగ్ ఉపయోగిస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ డ్రగ్ ఎగుమతులను మార్చి 25న కేంద్రం నిషేధించింది. దేశంలో సరిపడా నిల్వలున్నందున ఎగుమతులపై మంగళవారం (ఏప్రిల్ 7) ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. హైడ్రోక్సీక్లోరోక్విన్ను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్.. ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది.