అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ (78) ప్రమాణస్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.20 గంటలకు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎడమ చేతిని బైబిల్‌పై ఉంచి కుడి చేతిని పైకి లేపి బైడెన్ ప్రమాణం పూర్తి చేశారు. అంతకుముందు అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు.
అమెరికా నూతనాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన బైడెన్ అత్యంత వయోధికుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. 48 ఏళ్ల క్రితమే సెనేటర్‌గా ఎన్నికైన ఆయన.. ఇప్పటివరకు ఆరు సార్లు సెనేటర్‌గా పనిచేశారు. 1988, 2008లోనూ బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డారు. 1988లో అధ్యక్ష ఎన్నికల నుంచి ముందుగానే పోటీ నుంచి వైదొలిగారు. ఒబామా హయాంలో రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి దక్షిణాసియా సంతతిగా కమలా రికార్డుకెక్కారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఆఫ్రో అమెరికన్. కమలా తల్లి స్వస్థలం తమిళనాడు. తండ్రిది జమైకా దేశం. కమలా హారిస్ హేస్టింగ్స్ లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాద వృతిని చేపట్టిన కమలా.. 2002లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికయ్యారు. అనంతరం 2011లో శాన్‌ఫ్రాన్సిస్కో అటార్నీ జనరల్‌గా కమలా ఎన్నికయ్యారు. 2016లో డెమొక్రటిక్ అభ్యర్థిగా సెనేట్‌కు ఎన్నికయ్యారు.