అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణస్వీకార కార్యక్రమం సాదాసీదాగా జరగనుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో.. వాషింగ్టన్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం వద్ద 2021 జనవరి 20న కార్యక్రమం నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలోనే అతిథులకు అనుమతి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత వివరాలను కమిటీ వెల్లడించింది.
ప్రమాణం చేసిన అనంతరం.. బైడెన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. కరోనాపై పోరు సహా దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు, లక్ష్యాలు, ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన విధానాలను వివరిస్తారు.
ఇంటి నుంచే చూడండి..
అగ్రరాజ్యంలో ఇప్పుడే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా సమయమే పట్టొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని.. ప్రజలను ఇళ్ల వద్ద నుంచే కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు. వాషింగ్టన్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి రావొద్దని సూచించారు బైడెన్.
ట్రంప్ వెళ్తారా..?
డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొనేదీ లేనిది స్పష్టత లేదు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ఇదే విషయమై అడగగా.. దానిపై మాట్లాడనని నిర్మొహమాటంగా చెప్పారు.
అమెరికా తదుపరి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా మంగళవారం ఎన్నుకుంది. అయినా.. ట్రంప్ ఇంకా తన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. మోసపూరితంగా బైడెన్ గెలిచారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అంశమై సందిగ్ధం నెలకొంది. సంప్రదాయంగా నడుచుకుందామనుకుంటే ఆయన తప్పనిసరిగా రావాలి. లేదంటే ఇదే సమయంలో ఆయన 2024 ఎన్నికల కోసం ప్రచారం ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ముగిసిన ట్రంప్ పోరు- అధ్యక్షుడిగా బైడెన్ ధ్రువీకరణ