అమెరికా ప్రాథమిక ఎన్నికల్లో విజయపథంలో దూసుకుపోతున్నారు ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్ సాధించారు. మరో 1911 మంది డెమోక్రాట్ ప్రతినిధుల మద్దతు లభిస్తే ఆయన అధికారికంగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయవచ్చు.
మంగళవారం జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో పెన్సిల్వేనియా సహా మేరీల్యాండ్, ఇండియానా, రోద్ ఐలాండ్, న్యూ మెక్సికో, మోంటానా, సౌత్ డకోటాలో విజయదుందుబి మోగించారు బిడెన్. ఇందులో పెన్సిల్వేనియా నుంచి ఎక్కువ మంది డెమోక్రాట్ ప్రతినిధుల మద్దతు పొందారు. కొలంబియా ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
లాంఛనమే..
డెమోక్రాటిక్ పార్టీ వేసవి సమావేశాల నాటికి అధ్యక్ష పదవి నామినేషన్‌కు అవసరమైన స్థానాలను కైవసం చేసుకోనున్నారు బిడెన్. ఆయన ప్రత్యర్థులంతా ఇప్పటికే వైదొలిగినందున ఆయన నామినేషన్ లాంఛనమే కానుంది.
జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, కరోనా వైరస్ వ్యాప్తి వంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కొలంబియా జిల్లా సహా పలు రాష్ట్రాల్లో ఓటింగ్‌లో పాల్గొన్నారు ప్రజలు. మోంటానాలో మాత్రం మొయిల్ ఓటింగ్ నిర్వహించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ఓటర్లకు బ్యాలెట్ దరఖాస్తులను పంపించారు అధికారులు. సౌత్ డకోటా ఓటర్లకు ఏప్రిల్ చివర్లోనే చేరవేశారు.
ఇండియానాలో ట్రంప్ విక్టరీ..
ఇండియానాలో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా గెలుపొందారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డెమోక్రాట్ల అభ్యర్థిగా బిడెన్ ఘన విజయం సాధించారు.