డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వివాదాస్పద విధానాలను ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తాజాగా వలసదారుల అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశించిన వలసదారుల కుటుంబాలను ఏకం చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు బైడెన్.
"అమెరికా జాతికి, నైతికతకు అవమానం కలిగించేలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెనక్కితీసుకుంటున్నాం. ఎలాంటి ప్రణాళికలు లేకుండా వారు తీసుకున్న ఆ నిర్ణయాలు కుటుంబాల నుంచి చిన్నారులను దూరం చేశాయి. తల్లితండ్రులు తమ బిడ్డలకు దూరమయ్యారు. ప్రస్తుతం అదుపులో ఉన్న చిన్నారులు తమ కుటుంబాలతో కలిసేందుకు ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయి."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
వీటితో పాటు మరో రెండు దస్త్రాలపైనా అధ్యక్షుడు సంతకం చేశారు. దక్షిణాది నుంచి వచ్చే వలసదారుల ప్రధాన సమస్యలను రెండో కార్యనిర్వాహక ఉత్తర్వు పరిష్కరిస్తుందని బైడెన్ తెలిపారు. మూడో ఉత్తర్వు.. ట్రంప్ యంత్రాంగం ప్రవేశపెట్టిన వలస విధానాలను సమీక్షిస్తుందని చెప్పారు.
2018లో 'జీరో టాలరెన్స్ పాలసీ' పేరిట ట్రంప్ యంత్రాంగం వలసదారులపై ఉక్కుపాదం మోపింది. అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించినవారిపై విచారణ చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. వలసదారుల పిల్లలను కుటుంబ సభ్యులకు దూరం చేసింది. ట్రంప్ హయాంలో దాదాపు 5,500 వలస కుటుంబాల నుంచి పిల్లల్ని వేరు చేయగా ఇప్పటికీ 600 మంది చిన్నారుల కుటుంబాలను గుర్తించాల్సి ఉంది.
ఇదీ చదవండి: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్త నిరసన