చైనాతో అమెరికా సంబంధాలపై ఆ దేశ అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను ఎదుర్కొనేందుకు ఒకే రకమైన ఆలోచనలు పంచుకునే దేశాలతో.. కూటమిని నిర్మించాలని పేర్కొన్నారు.
"వాణిజ్య, సాంకేతికత, మానవ హక్కులతో పాటు ఇతర విషయాల్లో జవాబుదారీతనాన్ని చూపించాలని చైనాతో మనం పోరాడుతున్నాం. అయితే.. ఒకే రకమైన ఆలోచనలు గల వారితో పాటు మిత్రపక్షలతో జతకడితే మన బలం ఇంకా పెరుగుతుంది. ఫలితంగా మనకు రక్షణ పెరుగుతుంది. అమెరికా-చైనా బంధానికి సంబంధించి.. ఏ విషయంలోనైనా అందరం కలసిగట్టుగా ఉంటేనే మంచిది. భవిష్యత్తుపై మన ఆలోచనలు మరింత బలపడతాయి."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత
జాతీయ భద్రత, విదేశీ విధానాల సమీక్షకు ఏర్పాటు చేసిన బృందం సభ్యులతో సమావేశం అయిన అనంతరం బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా, రష్యాల నుంచి భద్రతపరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించి.. తనను తాను మెరుగైన స్థానంలో నిలుపుకోవడానికి.. అమెరికా తగిన సంస్కరణలు చేయడం తప్పదని అభిప్రాయపడ్డారు బైడెన్.
ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికా-చైనా బంధం ఎన్నడూ లేనివిధంగా బలహీనపడింది. వాణిజ్య యుద్ధం నుంచి కరోనా సంక్షోభం వరకు ప్రతి విషయంలోనూ చైనాపై కఠినంగా వ్యవహరించారు ట్రంప్. ఈ తరుణంలో చైనాపై బైడెన్ ఏ విధంగా వ్యవహరిస్తారు? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి:- మంచులో రష్యా సైనిక విన్యాసాలు- క్షిపణి ప్రయోగాలు