అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు రష్యా, చైనా సహా ఇతర దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయనే విషయం వాస్తవమని చెప్పారు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. ఈ విషయంపై గత నెలలో తాను స్పందించిన తర్వాత అమెరికా నిఘా వర్గాలు వివరాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. నవంబర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం కోసం నిధులు సేకరణకు నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో ఈ విషయాలు వెల్లడించారు బైడెన్.
" ఈ విషయం మనకు ఇదివరకే తెలుసు. కానీ ఇప్పుడు నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నిఘా వర్గాలు ఇందుకు సంబంధించిన వివరాలు నాకు మళ్లీ తెలియజేస్తున్నాయి. మన ఎన్నికలు చట్టబద్ధంగా నిర్వహించకుండా అడ్డుకునేందుకు రష్యా ఇంకా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనా, ఇతర దేశాలు కూడా ఫలితాలను ప్రభావితం చేయడానికి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. "
-జో బైడెన్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి
గత నెల 30 వరకు ఇందుకు సంబంధించిన వివరాలు తనకు నిఘా వర్గాలు తెలియజేయలేదని చెప్పారు బైడెన్. రష్యా, చైనా జోక్యం చేసుకుంటున్నాయని తాను వ్యాఖ్యానించిన తర్వాతే నిఘా వర్గాలు సమాచారాన్ని తనకు తెలిజేస్తున్నాయని పేర్కొన్నారు.
అయితే ఈ విషయంపై అమెరికా జాతీయ భద్రత సమాఖ్య మాత్రం స్పందించలేదు. బైడెన్ అధికార ప్రతినిధి కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
వచ్చే నెలలో జరిగే సదస్సులో బైడెన్ను అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించనుంది డెమొక్రటిక్ పార్టీ.