అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం- శ్వేతసౌధంలో భారత సంతతి వ్యక్తులు కీలక పాత్ర పోషించనున్నారు. కొత్తగా కొలువుదీరనున్న బైడెన్ యంత్రాంగంలో ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. ఇంకా ఈ 20మందిలో 17 మంది శ్వేతసౌధం కేంద్రంగానే విధులు నిర్వర్తించనున్నారు.
ఆ దేశ జనాభాలో భారతీయ అమెరికన్ల వాటా ఒక శాతం కంటే తక్కువే. అయినా, అమెరికా వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన పాలక వర్గంలో పెద్దపీట వేశారు. అలాగే, తన యంత్రాంగంలో వివిధ మూలాలున్న వారికి అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు. ప్రచార సమయంలోనే భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు బైడెన్ సంకేతాలిచ్చారు.
కమల, నీరా, వివేక్ ఇలా ఎందరో..
ఇక ఉపాధ్యక్షురాలిగా కూడా భారత మూలాలున్న కమలా హారిసే ఎన్నికయ్యారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కావడమే కాకుండా.. ఆ పదవిని అలంకరించనున్న తొలి భారత సంతతి వ్యక్తి, ఏషియన్ అమెరికన్ కావడం విశేషం. ఇక హారిస్ తర్వాత బైడెన్ బృందంలో మరో కీలక పదవిని చేపట్టనున్న భారతీయ అమెరికన్ నీరా టాండన్. ఈమె 'ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్' డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఇక మరో వ్యక్తి వివేక్ మూర్తి. ఈయన అమెరికా సర్జన్ జనరల్‌గా వ్యవహరించనున్నారు.
ఇదీ చూడండి: బైడెన్ 'శ్వేతసౌధం డిజిటల్ బృందం'లో కశ్మీరీ
అసోసియేట్ అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌గా వనితా గుప్తా, పౌర భద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అండర్ సెక్రెటరీగా ఉజ్రా జయాను ప్రతిపాదించారు.
కాబోయే ప్రథమ మహిళకు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా, డిజిటల్ డైరెక్టర్‌గా గరిమా వర్మ, డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్‌ను నియమించారు. కశ్మీర్ మూలలున్న ఇద్దరికి తొలిసారిగా కీలక పదవులు దక్కాయి. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలో పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా ఈషా షా, అమెరికా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్‌గా సమీరా ఫాజిలిని బైడెన్ నామినేట్ చేశారు. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా రామమూర్తిని ఎంపిక చేశారు.
ఇదీ చూడండి: బైడెన్ బృందంలో మరో భారత సంతతి మహిళకు చోటు