ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది అమెరికా ప్రభుత్వం. 'బిల్డ్ బ్యాక్ బెటర్' ఎన్నికల హామీని నెరవేర్చేలా ప్యాకేజీ రూపొందించడంపై అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం సాయంత్రం డెమొక్రటిక్ పార్టీ చట్టసభ్యులతో విస్తృతంగా చర్చించారు.
కరోనాతో దెబ్బతిన్న రంగాలకు సాయం అందించేందుకు ఇటీవలే 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ తీసుకొచ్చింది బైడెన్ ప్రభుత్వం.
విద్య, వైద్య రంగాల బలోపేతం
కరోనా ఉపశమనం ప్యాకేజీని... లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న వ్యాపారులకు ఊతమివ్వడంపై ప్రధానంగా దృష్టి సారించి, రూపొందించారు. తాజాగా రూపొందిస్తున్న ప్యాకేజీ ద్వారా సగటు అమెరికన్ కుటుంబాలకు సాధ్యమైనంత సాయం అందించాలని బైడెన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. విద్య, వైద్యం విషయంలో వారికి అండగా నిలిచేలా ప్యాకేజీ ఉంటుందని తెలిసింది.
మౌలిక వసతులకు కొత్త రూపు
ఇందులో 1 ట్రిలియన్ డాలర్లను రోడ్లు, వంతెనలు, రైల్వే లైన్లు, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ బంక్‌లకు, సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ల అభివృద్ధి, విస్తరణకు కేటాయించనున్నారని తెలిసింది.
మౌలిక వసతులపై ఈ స్థాయిలో ఖర్చు చేయడం ద్వారా దేశ ఆర్థిక రంగం ఈ ఏడాదిలో 6.5 వృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి:అంతా అమెరికానే చేసింది: రష్యా