ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మూలాలను శోధించడానికి అడుగులు చకచకా పడుతున్నాయి. వైరస్ పుట్టుకకు సంబంధించి పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(biden).. ఆ దేశ నిఘా సంస్థలను కోరారు. ఈ వైరస్ జంతువుల నుంచి సోకిందా, సహజ సిద్ధంగా ఉద్భవించిందా? లేక ప్రయోగ శాలల్లో రూపొందించిందా అనే దానిపై సరైన సాక్ష్యాలు లేవని, ఆధారాలు సరిపోవడం లేదని బైడెన్ తెలిపారు.
కొవిడ్ పుట్టుకకు గల కారణాలు ఒకటికి మూడు ఉన్నట్లు ఉన్నాయన్న ఆయన వాటిని అంచనా వేసేందుకు తగిన సమాచారం తమ వద్ద లేదని తెలిపారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పారు. ఈ దర్యాప్తుకు అమెరికాలోని జాతీయ ప్రయోగశాలలన్నీ సహకరించాలని ఆదేశించారు. వైరస్ మూలాలు గురించి అంతర్జాతీయ పరిశోధనలతో కలిసి చేసేందుకు చైనా కలసి రావాలని పిలుపునిచ్చారు. చైనాపై ఒత్తిడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వాములతో కలిసి అమెరికా పని చేస్తుందని బైడెన్ చెప్పారు.
అంతర్జాతీయ పరిశోధనలకు పూర్తి స్థాయిలో సహకరించడానికి చైనా ప్రభుత్వం సుముఖంగా లేదని, ఇలా ఉంటే ఎప్పటికీ ఈ విషయంపై ఓ అంచనాకు రాలేమని తెలిపారు.
ఇదీ చూడండి: కొవిడ్ 'ల్యాబ్ లీక్'పై చైనా స్వతంత్ర దర్యాప్తు?