ఫుడ్ స్టాంప్ వంటి ప్రజా సేవలు పొందుతున్న వలసదారులకు గ్రీన్‌కార్డు ఇవ్వకూడదన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిబంధనను తిరగరాసేందుకు చర్యలు చేపట్టింది.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం. ఇందుకు సంబంధించి.. ఆ దేశ సుప్రీంకోర్టుతో పాటు ఇతర కోర్టుల్లో ప్రభుత్వం తరఫున ఉన్న వ్యాజ్యాలను ఉపసంహరించుకుంది.
ఈ నిబంధననలు సవాలు చేసిన వ్యక్తులు, రాష్ట్రాలతో బైడెన్ యంత్రాంగం.. ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా.. దీని చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఇక సమీక్షించదు. దేశవ్యాప్తంగా ఈ నిబంధనను తొలగించాలంటూ ఫెడరల్ జడ్జి ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన అభ్యర్థనలను కూడా ఉపసంహరించుకుంది అగ్రరాజ్య న్యాయశాఖ.
2018లో ఈ నిబంధనను ప్రతిపాదించింది ట్రంప్ ప్రభుత్వం. ఇలా చేస్తే.. సొంతంగా బతకగలిగే వారు మాత్రమే అమెరికాలోకి వస్తారని పేర్కొంది. ఫుడ్ స్టాంప్, వైద్య సహాయం, హౌసింగ్ ఓచర్లు ఈ ప్రజా సేవల జాబితాలో ఉన్నాయి.
ఈ నిబంధనను సవాలు చేస్తూ ఆ దేశ న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం వ్యాజ్యాలు దాఖలు చేసింది. వీటినే తాజాగా బైడెన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఈ నిబంధనతో అటు ప్రజలకు.. ఇటు ప్రభుత్వ వనరులకు ఏ విధంగానూ ఉపయోగం లేదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా.. ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇదీ చూడండి:- బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు