బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలోని ఓ మురికి వాడలో ఉన్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులే లక్ష్యంగా చేపట్టిన పోలీస్ ఆపరేషన్‌లో ఓ అధికారి సహా.. 25మంది అనుమానితులు మృతి చెందారు.
జకరెఝినో ప్రాంతంలో సాయుధులు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతున్న దృశ్యాలు, వారిని నియంత్రించేందుకు మురికివాడ మీదుగా హెలికాప్టర్ ఎగురుతున్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేశాయి. ఈ ఆపరేషన్‌లో 16 తుపాకులు సహా.. ఆరు రైఫిల్స్, ఒక మెషిన్ గన్, 12 గ్రనేడ్లు, షాట్గన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తీవ్రంగా గాయపడి నిస్సహాయంగా ఉన్న నిరాయుధుడైన వ్యక్తిని పోలీసులు చంపడం చూసినట్లు ఒక మహిళ అసోసియేటెడ్ ప్రెస్ ఛానల్‌కి తెలిపారు. అయితే ఈ ఘటనపై 'హ్యూమన్ రైట్స్ వాచ్' మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చేసిన విమర్శలను రియో పోలీసు విభాగం డిటెక్టివ్ ఖండించారు. మరణించిన వారంతా కరుడుగట్టిన నేరస్థులని.. పోలీసులను హతమార్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకే ప్రతిదాడులు జరిపినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.
కాల్పులు జరిగిన మార్గాన్ని తాత్కాలికంగా మూసేశారు పోలీసులు. ఇక నేరస్థులను దాచేందుకు యత్నించిన ఇళ్లపైనా దాడులు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నేరమయం..
దాదాపు 40,000 మంది జనాభా గల జకరెఝినో నగరం కేంద్రంగా.. 'కమాండో వెర్మెల్హో' అనే ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది బ్రెజిల్‌లోనే అత్యంత క్రూరమైన ముఠాగా పేరొందింది. రైళ్ల హైజాక్, యువతను నేరప్రవృత్తిలోకి దించడం వంటి అనేక నేరాలపై దర్యాప్తు చేసేందుకు గురువారం ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ దాడిని ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా కాడిండో మెండీస్ యూనివర్సిటీ విభాగం అభివర్ణించింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సిందిగా బ్రెజిల్ సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని అభిప్రాయపడింది.
ఇవీ చదవండి: బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు