ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతున్న సమయంలో మెక్సికో జైలులో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. జకాటెకాస్ రాష్ట్రంలోని సియెన్‌గుయిలాస్ జైల్లో ఖైదీలు మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 16 మంది మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఖైదీల మధ్య గొడవ జరిగినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తరువాత అధికారుల చొరవతో అక్కడి ఉద్ధ్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో ఖైదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
జైల్లో మారణాయుధాలు
ఘర్షణ జరిగిన తరవాత జైల్లో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ రాష్ట్ర భద్రతా కార్యదర్శి ఇస్మాయిల్ కాంబెరోస్ హెర్నాండెజ్ తెలిపారు. శని, ఆదివారాల్లో జైళ్లను సందర్శించి ఆయుధాల కోసం శోధించామన్నారు. ఎలాంటి ఆయుధాలు దొరకలేదని.. ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉందన్నారు. అయితే మృతులందరూ తుపాకీ కాల్పుల్లో మాత్రమే చనిపోలేదు, కొందరు కత్తిపోట్లకు గురయ్యారు, మరికొందరు ఇతర పరికరాలతో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:నడిరోడ్డుపై చిరుతల సయ్యాట.. వీడియో వైరల్