చందమామపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన అపూర్వ ఘట్టంలో కీలక పాత్రధారుల్లో ఒకరైన అపోలో 11 వ్యోమనౌక సారథి మైఖేల్ కొలిన్స్ బుధవారం తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల కొలిన్స్ క్యాన్సర్‌తో మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 1969లో అమెరికా వ్యోమనౌకకు కొలిన్స్ పైలట్‌గా వ్యవహరించారు. అందులో ప్రయాణించిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్.. లూనార్ ల్యాండర్ ద్వారా జాబిల్లిపై పాదం మోపారు. ఆ సమయంలో కొలిన్స్ చందమామ ఉపరితలానికి 69 కి.మీ. దూరంలో అపోలో 11 కమాండ్ మాడ్యూల్ అయిన కొలంబియాలోనే ఉండిపోయారు.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్ తిరిగి కక్ష్యలోకి చేరుకున్న తర్వాత వారి స్పేస్ క్రాప్ట్ను తానున్న స్పేస్ క్రాప్ట్‌తో అనుసంధానించి, క్షేమంగా భూమి మీదకు తీసుకురావటంలో కొలిన్స్ అమోఘమైన పాత్రను నిర్వహించారు.
జాబిల్లిపై పాదం మోపే అవకాశం తనకు రానందుకు ఎన్నడూ తాను బాధపడలేదని, చంద్రగ్రహంపైకి మానవుడి యాత్రను విజయవంతం చేయటంలో తాను నిర్వహించిన పాత్ర తనకు సంపూర్ణమైన సంతృప్తినిచ్చిందని 1974లో ప్రచురితమైన తన ఆత్మకథ 'క్యారియింగ్ ద ఫైర్'లో కొలిన్స్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఈసీ మార్గదర్శకాల్లో స్పష్టత లేదు: టీఎంసీ