America Sanctions On India: ఉక్రెయిన్‌పై జరుగుతోన్న దురాక్రమణను వ్యతిరేకిస్తోన్న దేశాలు రష్యాపై ఆంక్షలు విధించే కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. అంతేకాకుండా రష్యాకు మద్దతిచ్చే దేశాలపైనా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా నుంచి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తోన్న భారత్‌పైనా అమెరికా ఆంక్షలు విధించే యోచనలో ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటువంటి ఆలోచనను అమెరికాలోని టాప్ రిపబ్లికన్ సెనెటర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవేళ బైడెన్ ప్రభుత్వం అటువంటి ఆంక్షలు విధించాలని నిర్ణయిస్తే అది ‘అత్యంత మూర్ఖత్వమే’ అవుతుందని స్పష్టం చేశారు.
మూర్ఖమైన నిర్ణయం..
'ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌పై సీసీఏటీఎస్‌ఏ చట్టం కింద ఆంక్షలు విధించే యోచనలో బైడెన్ పాలనా యంత్రాంగం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ నిర్ణయం అత్యంత మూర్ఖ సాహసమైనదే అవుతుందని నేను భావిస్తున్నాను' అని రిపబ్లికన్ సెనెటర్ టెడ్ క్రూజ్ స్పష్టం చేశారు. పెండింగ్ నామినేషన్లపై సెనెట్ (అమెరికా ఎగువసభ)లో శక్తివంతమైన కమిటీగా పేరున్న 'విదేశీ సంబంధాల కమిటీ' విచారణ సందర్భంగా టెడ్ క్రూజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో అన్నిరంగాల్లో భారత్ కీలక భాగస్వామిగా ఉందన్న టెడ్ క్రూజ్.. ఇటీవలి కాలంలో అమెరికా-భారత్ సంబంధాలు విస్తరించడంతోపాటు మరింత బలపడ్డాయని అన్నారు. కానీ, బైడెన్ పాలనలో ఇవి మళ్లీ వెనక్కి పోతున్నట్లు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాను ఖండించేందుకు ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రస్తావించిన ఆయన, కేవలం భారత్ ఒక్కటే అమెరికాకు వ్యతిరేకంగా ఓటు వేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వసభ్య సభ, భద్రతా మండలిలో ఓటింగ్ జరిపినప్పుడు భారత్ గైర్హాజరవడాన్ని అమెరికాలో అధికార డెమోక్రాట్, ప్రతిపక్ష రిపబ్లికన్ సభ్యులు భారత్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌పైనా చర్యలకు ఉపక్రమించే యోచనలో అమెరికా ఉందనే వార్తలు వెలుబడ్డాయి. ఈ నేపథ్యంలో సెనెటర్ టెడ్ క్రూజ్ భారత్‌కు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏమిటీ క్యాట్సా చట్టం..?
ఇరాన్, ఉత్తరకొరియా లేదా రష్యాలతో ఏ దేశమైనా ముఖ్యమైన లావాదేవీలను కొనసాగిస్తున్నట్లయితే వాటిపై చర్యలు తీసుకునేందుకు 'ఆంక్షల ద్వారా అమెరికా విరోధులను ఎదుర్కొనే 'క్యాట్సా' చట్టాన్ని (CCATSA)' అగ్రరాజ్యం అమెరికా ప్రయోగిస్తోంది. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల అనంతరం ఈ ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా రష్యా నుంచి రక్షణ హార్డ్‌వేర్‌లను కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా యంత్రాంగం ఆంక్షలు విధించేందుకు ఈ కఠినమైన సీసీఏటీఎస్‌ఏ చట్టాన్ని ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో ఎస్-400 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించింది.
లెక్కచేయని భారత్..
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ వ్యవస్థలుగా భావిస్తున్న ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు 2018లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ విషయమై ట్రంప్ యంత్రాంగం అనేక సార్లు వారించినప్పటికీ.. ఈ విషయంలో భారత్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పొరుగు దేశాలనుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఎస్-400 కొనుగోలు తప్పనిసరని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు తాజాగా ఏర్పడిన ఉక్రెయిన్ సంక్షోభం సమయంలోనూ భారత్‌తో కుదిరిన రక్షణ ఒప్పందాలకు కట్టుబడి ఉన్నామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యాతో భారత్ కొనసాగిస్తోన్న రక్షణ ఒప్పందాలను వ్యతిరేకిస్తోన్న అమెరికా.. భారత్‌పైనా ఆంక్షలు విధించే యోచనలో ఉంది. దీనిపై అమెరికా చట్టసభ సభ్యుల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఆయిల్ కొనుగోళ్లు బంద్.. అత్యధిక ఆంక్షలు రష్యాపైనే