America Russia News: తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ.. రష్యా చేసిన ప్రకటనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రష్యాపై అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆంక్షలు విధించినట్లు శ్వేతసౌధం తెలిపింది.
రష్యా గుర్తించిన రెండు ప్రాంతాల్లోనూ కొత్తగా పెట్టుబడులు, వాణిజ్యం, ఇతర కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని పేర్కొన్నారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి.
జాతీయ భద్రత బృందంతో బైడెన్ భేటీ..
మరోవైపు.. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత బృందంతో అధ్యక్షుడు బైడెన్ భేటీ అయ్యారు. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలను బైడెన్‌కు వివరించారు అధికారులు.
ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్..
ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తత నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీకు ఫోన్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బైడెన్.
ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతపై జర్మన్ ఛాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తోనూ బైడెన్ సంభాషించారు.
ఐరాస ఆందోళన
ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధవాతావారణం, తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా స్వతంత్రత ఇవ్వడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా నిర్ణయం ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఐరాస చార్టర్‌లోని నియమావాళికి ఇది విరుద్ధమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలకు శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు.
యూఎన్‌ఎస్సీ అత్యవసర సమావేశం..
మరోవైపు, ఐరాస భద్రతా మండలి.. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉక్రెయిన్, అమెరికా సహా ఎనిమిది దేశాల అభ్యర్థన మేరకు సమావేశానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూయార్క్ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు సభ్యులు భేటీ కానున్నారు. అయితే, ఈ మండలికి ప్రస్తుతం రష్యా అధ్యక్షత వహిస్తోంది. రష్యాకు వీటో అధికారం ఉన్న నేపథ్యంలో భద్రతా మండలి ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం లేదన్నది సుస్పష్టం. ఈ అంశంపై సంయుక్త ప్రకటన కూడా వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చట్టాల్ని ఉల్లంఘించిన రష్యా..
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా స్వతంత్రత ఇవ్వడంపై యూరోపియన్ యూనియన్ మండిపడింది. రష్యా.. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని తెలిపింది. రష్యాపై ఈయూ దేశాలు ఆంక్షలు విధిస్తాయని ఈ కూటమిలోని సభ్యులు తెలిపారు. ఉక్రెయిన్ స్వతంత్రతకు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు.
చట్ట ఉల్లంఘనే..
మరోవైపు రష్యా చర్యపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు.
జర్మన్ ఛాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం పుతిన్ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
స్వతంత్ర రాష్ట్రాల్లో శాంతికి పిలుపు!
తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్ స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ రాష్ట్రాలకు రష్యా నుంచి మిలిటరీ సహకారం ఉంటుందని అన్నారు. ఈ ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలని సైనిక వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర తప్పదని పుతిన్ సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: యుద్ధానికి సై- సైన్యం ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పౌరుల సాధన