ETV Bharat / international

అగ్రరాజ్య అధినేత 'ట్రంప్'​ సరిసాటి ఎవ్వరు? - trump news

తన నిర్ణయాల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆర్థిక రంగాలన్నింటి మీదా ప్రసరించడం కేవలం వాటివల్లే తాను శక్తిమంతుడినంటే డొనాల్డ్‌ ట్రంప్‌ ఏ మాత్రం ఒప్పుకోరు. విభిన్న రంగాల్లోని కళాకారులు, నోబెల్​ గ్రహీతల మేధను పుణికి పుచ్చుకొని శ్వేతసౌధంలో కాలిడటమే అమెరికన్ల అదృష్టమని మురిసిపోతుంటారు. కరోనా కట్టడి కోసం ఇటీవల ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలన్నీ నిర్ఘాంతపోయేలా చేశాయి.

America president donald trump
అగ్రరాజ్య అధినేత 'ట్రంప్'​ సరిసాటి ఎవ్వరు?
author img

By

Published : Apr 26, 2020, 7:35 AM IST

అమెరికా అధ్యక్షుడంటే సర్వశక్తిమంతుడని అందరికీ తెలుసు. ఈ భూమండలాన్ని అనేకసార్లు భస్మీపటలం చెయ్యగల అణ్వస్త్రాల మీట తన చెంత ఉండటం, తన నిర్ణయాల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆర్థిక రంగాలన్నింటి మీదా ప్రసరించడం- కేవలం వాటివల్లే తాను శక్తిమంతుడినంటే డొనాల్డ్‌ ట్రంప్‌ ఏ మాత్రం ఒప్పుకోరు. భిన్న రంగాల్లో ఆరితేరిన చార్లీ చాప్లిన్‌, మైకేల్‌ జాక్సన్‌, జాకీ చాన్‌ వంటివారి కళాభినివేశంతో పాటు పలువురు నోబెల్‌ గ్రహీతల మేధను పుణికి పుచ్చుకొని తాను శ్వేతసౌధంలో కాలిడటమే అమెరికన్ల అదృష్టమని మురిసిపోతుంటారు. విలయం విరుచుకుపడుతున్నా దాన్ని ధిక్కరించడమే వీర లక్షణమన్న తెలివిడితో- ఏదో ఒకనాడు ఉన్నట్లుండి అది మాయమైపోతుందని ఫిబ్రవరిలోనే ట్రంప్‌ కాలజ్ఞానం బోధించారు. జూన్‌ నెల మొదలయ్యేదాకా కొవిడ్‌ పీడ తప్పేటట్లు లేదన్న హెచ్చరికలు చెవిన పడుతుండటంతో- వైద్యశాస్త్రాన్ని మధించిన తనలోని మరో మనిషిని బలవంతంగా నిద్ర లేపారు. రోగి పోయాక రోగమేం చేస్తుందన్న తాత్విక చింతన జోలికెళ్లకుండా ప్రాణాంతక వైరస్‌ పనిపట్టాల్సిందేనంటూ ట్రంప్‌ మహాశయుడు చేసిన సూచనలు- క్రిమినాశక రసాయనాలకు ఉన్నట్లుండి గిరాకీ పెంచేస్తున్నాయి. అజ్ఞాన సర్వస్వానికి నిలువెత్తు నమూనాలా అమెరికా అధ్యక్షుడే వ్యవహరిస్తుంటే ప్రపంచ దేశాలన్నీ నిర్ఘాంతపోతున్నాయి!

నిగూఢంగా మనిషిలోకి చొరబడే కరోనా వైరస్‌ రెండు వారాలపాటు రోగలక్షణాలు బయటపడనివ్వకుండా, ఈలోగా అతడి సామీప్యానికి వచ్చే వారందరికీ పాకుతుందని ఇప్పటికే వెల్లడైంది. కరోనా సోకిన వ్యక్తి తాకే ఉపకరణాల ద్వారానూ అది వ్యాపించే ప్రమాదం ఉందనీ అధ్యయనాలు మొత్తుకొంటున్నాయి. రోజువారీ ఉపయోగించే వస్తువుల నుంచి కొవిడ్‌ వ్యాపించకుండా ఇండియాకు చెందిన రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) అతినీల లోహిత కాంతితో పనిచేసే పరికరాల్ని అభివృద్ధి చేసింది. ఇలాంటి సమాచారం చెవిన పడగానే ట్రంప్‌ వారి మెదడు పాదరసంలా పనిచేసింది. సూర్యకాంతి నేరుగా ప్రసరించినప్పుడు వైరస్‌ చాలా వేగంగా చచ్చిపోతుందని, ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌ను ప్రయోగించినప్పుడు అర నిమిషంలోనే అది హతమవుతుందని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీకి చెందిన శాస్త్ర సాంకేతిక విభాగం పేర్కొనగానే- కరోనాను కుమ్మి కూలగొట్టే ఘనతర వ్యూహం ట్రంప్‌ నోట దూసుకొచ్చింది. వైరస్‌ను చంపగలిగే క్రిమినాశక రసాయనాన్ని రోగి శరీరంలోకి ప్రవేశపెట్టే మార్గం ఏదైనా ఉందా... లేదా దానితో శుద్ధి చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్న ఎగదన్నుకొచ్చింది. అంతటితో ఆగితే మానవాళికి జ్ఞానబోధ అసంపూర్ణమవుతుందన్న దూరాలోచనతో-అతినీలలోహిత కాంతిని, శక్తిమంతమైన మరేదైనా కాంతితో శరీరాన్ని బలంగా తాకిస్తే ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్నా దూసుకొచ్చింది. లేదంటే దాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టాలి అంటూ ఆ విధానాన్ని పరీక్షిస్తామని చెప్పినట్లున్నారని ట్రంప్‌ ఎంతో ఉత్సాహంగా ఆరా తీశారు. పంటలకు చీడపీడలు ఆశించినప్పుడు కీటక నాశనుల్ని పిచికారీ చేసే పద్ధతిలో- వైరస్‌ల తాకిడి నుంచి జనాన్ని అదే విధంగా ఎందుకు రక్షించరాదన్న డొనాల్డ్‌ ట్రంప్‌ యోచన వైద్యరంగంలోనే విప్లవాత్మకమైనది!!

రాజే మొండివాడైతే?

మొండివాడు రాజుకంటే బలవంతుడు. రాజే మొండివాడైతే...?’ అన్న ప్రశ్నకు ట్రంప్‌ను సమాధానంగా చూపించాలిప్పుడు! ప్రాణాంతక కరోనా కోరలు పీకేందుకు వైద్యపరిశోధనలు ఒక వంక ముమ్మరంగా సాగుతుంటే, మలేరియాకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధం కొవిడ్‌ రోగులకు సంజీవని లాంటిదని ఆయన బుర్రకు తోచింది. వెంటనే ఇండియా ఆ మందులు పంపించకపోతే అమెరికా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న హెచ్చరికతో హడావుడి చేసిన ట్రంప్‌ మహాశయుడికి తీరా ఆ ఔషధాలు చేతికి అందాకగాని, వాస్తవం అవగతం కాలేదు. ట్రంప్‌ మాట నమ్మి వాటిని కొవిడ్‌ రోగులకు విరివిగా వినియోగిస్తున్నారని, వాటివల్ల గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అక్కడి వైద్య యంత్రాంగం మొత్తుకొంటోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మత్తు వదిలాక ట్రంప్‌ సరికొత్తగా క్రిమినాశక రసాయనాల పాట ఎత్తుకోవడం- మరో కొత్త సంక్షోభానికి అంటుకడుతుందేమోనని అక్కడి నిపుణులు చింతాక్రాంతులవడంలో వింతేముంది?

విలక్షణశైలి!

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అమెరికా గత అధ్యక్షులు 44మందితో పోలిస్తే డొనాల్డ్‌ ట్రంప్‌ది విలక్షణశైలి! ఫైర్‌బ్రాండ్‌గా తన ఉనికి స్థిరంగా ఉండాలంటే, ఎక్కడో ఒకచోట అగ్గి రగులుతూనే ఉండాలన్నది ఆయన బాణీ. మెక్సికో నుంచి వలసల కట్టడికి అడ్డుగోడ కడతానంటూ సామాజిక స్పర్థలు పెంచే అజెండాతో అధికారానికి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌కు పూర్వ రాజకీయ అనుభవం ఏమీలేదు. రిపబ్లికన్‌ అభ్యర్థిగా గెలిచి 34వ అధ్యక్షుడైన ఐసన్‌ హోవర్‌ సైతం పూర్వ రాజకీయానుభవం లేని వ్యక్తే! రెండో ప్రపంచ యుద్ధకాలంలో ‘ఫైవ్‌స్టార్‌ జనరల్‌’గా అమెరికా దళాల్ని నడిపించిన హోవర్‌ పాలనకాలం (1953-61)లో ప్రపంచం పెనుసంక్షోభంలోనే ఉంది. అంతర్రాష్ట్రీయ రహదారి వ్యవస్థ ద్వారా అమెరికాను సంఘటితం చేసి, నేషనల్‌ డిఫెన్స్‌ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ ద్వారా అమెరికాలో సైన్స్‌ విద్యకు గట్టి పునాదులేసిన హోవర్‌ చరితార్థుడయ్యారు. ఆయా సందర్భాలకు తగిన హేతుబద్ధ పరిష్కారాలతో అగ్రరాజ్యాన్ని ధీమాగా నడిపించారు. అందుకు పూర్తిభిన్నంగా నేడు- ట్రంప్‌ మాటల్లో చేతల్లో హేతుబద్ధత, శాస్త్రీయ స్పృహ మచ్చుకైనా లేవు!

హెచ్చరికలు లెక్క చేయకనే..

నాలుగేళ్ల క్రితం ఎబోలా విరుచుకు పడ్డప్పుడు ఒబామా హయాములో జాతీయ భద్రతామండలి- మహమ్మారులను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై 69 పేజీల వ్యూహపత్రం సిద్ధం చేసింది. వైరస్‌ విస్తరణను పసిగట్టడం, సమర్థంగా రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ, అత్యవసర వనరుల్ని ముందుగానే సిద్ధం చేసుకోవడంపై విలువైన సూచనలు అందించింది. ఆ సమాచారాన్ని కొత్తగా అధ్యక్షత చేపట్టిన ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్ళినా ఆయన దాన్ని అటకెక్కించారు. అంటువ్యాధుల పట్ల కొరవడిన సన్నద్ధత కొంప ముంచుతుందంటూ నిరుడు అక్టోబరులో హెచ్చరికలు చెవినపడ్డా ఆయన లెక్క చెయ్యనేలేదు. కాబట్టే అమెరికాలో మరణాలు 50 వేలు దాటిపోయాయి. అమెరికాలో లక్ష మరణాలతో కొవిడ్‌ శాంతిస్తే- తమ ప్రభుత్వం బాగా పనిచేసినట్లేనని ముందస్తుగా తనకుతానే కితాబులిచ్చుకున్న ట్రంప్‌కు సమకాలీన చరిత్రలో సరిసాటి ఎవ్వరు? ‘సమస్య కోసం అన్వేషించడం, ఎక్కడపడితే అక్కడ దాన్ని కొనుగొనడం, దాని మూలాల్ని తప్పుల తడకగా నిర్ధారించడం, తప్పుడు పరిష్కారాల్ని ప్రతిపాదించి అమలుచేసే కళే రాజకీయం’ అని గ్రేచో మార్క్స్‌ అనే మేధావి సూత్రీకరించాడు. ట్రంప్‌ వరస చూస్తేచాలు- అదెంత నిజమో బోధపడుతుందిప్పుడు!

--- పర్వతం మూర్తి (రచయిత)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.