ఈ శతాబ్దంలోనే అత్యంత ఘోరమైన మహమ్మారి, ఈ దశాబ్దంలోనే పెను ఆర్థిక సంక్షోభం తనకు వారసత్వంగా లభించాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ ఉభయ సభల సమావేశంలో తన మొదటి ప్రసంగం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
చరిత్రలో ఎందరో అధ్యక్షులు యుద్ధం-శాంతితో పాటు.. ఆయా ప్రణాళికలపై కాంగ్రెస్‌లో ప్రకటనలు చేశారని.. తాను మాత్రం దేశ పునర్నిర్మాణం, ప్రజాస్వామ్య పునరుజ్జీవం, అమెరికన్ల భవిష్యత్తుపై మాట్లాడేందుకు వచ్చానని బైడెన్ తెలిపారు.
"నేను ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజులైంది. గడచిన వందేళ్లలోనే ఘోరమైన మహమ్మారి(కరోనా)ని, మహా మాంద్యం తరువాత ఈ దశాబ్దంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని నేను వారసత్వంగా పొందాను. ఈ 100 రోజుల్లో నేను చేసిన పనిని సగర్వంగా దేశం ముందుంచగలను. అమెరికా మళ్లీ పుంజుకుంటోంది. సంక్షోభం నుంచి అవకాశాల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది."
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
100 రోజుల క్రితం అమెరికా ప్రజాస్వామ్యం మంటల్లో ఉందని.. అయితే డెమొక్రటిక్ నేతల అసాధారణ నాయకత్వం పెద్ద ఉపద్రవం నుంచి కాపాడిందన్నారు బైడెన్. ఈ మేరకు క్యాపిటల్ హిల్ ఘటన, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అమెరికన్లు కుంగిపోరని.. పడినా లేచే మనస్తత్వం కలిగి ఉంటారని బైడెన్ వ్యాఖ్యానించారు.
"భయం మాటున ఆశ, అబద్దాలపై సత్యం.. చీకటిపై వెలుగు ఎప్పుడూ ఉంటాయి. అమెరికా వేగంగా ఎదుగుతోంది. అందుకు మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం."
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ప్రతి ఒక్కరికీ టీకా..
తాను అధికారంలోకి వచ్చాక కరోనా టీకాల పంపిణీ గురించి కాంగ్రెస్‌కు వివరించారు బైడెన్. ఇప్పటికే దేశంలో 5లక్షల 74వేల మందికి పైగా పౌరులు మరణించారని.. అమెరికాలో అందరూ టీకాలు తీసుకోవాలని ఆయన కోరారు.
దేశంలో ప్రతి మూలకూ వ్యాక్సిన్‌ను చేరవేసేందుకు కృషి చేస్తున్నట్లు బైడెన్ వివరించారు. 90శాతం మంది ప్రజలకు టీకా శిబిరం కేవలం ఐదు మైళ్ల దూరంలో ఉందన్నారు. అదేవిధంగా పేదల కోసం దాదాపు 40,000 మందుల దుకాణాలు సహా.. 700కి పైగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు టీకాలు కేటాయించినట్లు బైడెన్ వెల్లడించారు. తన 100 రోజుల పాలనలో టీకాల పంపిణీని అతిపెద్ద విజయంగా బైడెన్ అభివర్ణించారు.
బైడెన్ ప్రసంగం సమయంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా.. స్పీకర్ నాన్సీ పెలోసి ఆయన పక్కనే ఉన్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి ఇలా అత్యున్నత హోదాలలోని మహిళలు అధ్యక్షుని పక్కన ఉండటం విశేషం.
ఇవీ చదవండి: 'భారత్ మాకు సాయం చేసింది.. మేమూ చేస్తాం'