అమెరికా తిరిగి అమేయశక్తిగా ఆవిర్భవిస్తోందని.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా 50 రోజులు పూర్తి చేసుకున్న బైడెన్.. కరోనా కట్టడిలో అమెరికా విజయవంతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటోందని చెప్పారు. 2 కోట్ల 91 లక్షల 50 వేల మందికి పైగా అమెరికన్లు కరోనా బారిన పడగా దాదాపు 5 లక్షల 29 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు.
కరోనా సృష్టించిన విధ్వంసం కారణంగా ఇప్పటికీ కోటీ 80 లక్షల మంది నిరుద్యోగబీమాపై ఆధారపడి బతుకీడుస్తున్నారు. దాదాపు 4 లక్షలకు పైగా చిరువ్యాపారులు పూర్తిగా మూతపడ్డాయి. ఈ సమస్యలన్నింటి నుంచీ త్వరలోనే అమెరికా బయటపడుతుందని దేశ పౌరులకు బైడెన్ భరోసా ఇచ్చారు. ఏ దేశం కూడా సాధించలేనంతగా తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి జరిపి సరఫరా కూడా చేశామని చెప్పారు. శాస్త్రీయంగా ఇదో అద్భుతమని బైడెన్ అన్నారు. పర్సీవరెన్స్ రోవర్ పంపుతున్న మార్స్ ఫొటోలు అమెరికన్ల శక్తిసామర్థ్యాలను, ఒకరిపై ఒకరికున్న విశ్వాసాన్ని చాటుతున్నాయన్నారు.
ఇదీ చూడండి:'మే 1 నాటికి వయోజనులందరికీ టీకా'