అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లోని బేస్‌బాల్ స్టేడియం వెలుపల కాల్పులు జరిగాయి. రెండు కార్లలో వచ్చిన దుండగులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పారు.
బేస్‌బాల్ స్టేడియంలో ఆట ప్రారంభానికి ముందు కాల్పుల ఘటన జరిగింది. దీంతో వాషింగ్టన్ నేషనల్స్, సాన్‌డియాగో ప్యాడర్స్ మధ్య జరగాల్సిన ఆట.. రద్దైంది. కాల్పులతో స్టేడియం లోపలి ప్రేక్షకులు భయాందోళనలకు గురికాగా.. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు స్టేడియం నుంచి ప్రేక్షకులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.
మరో రెండు చోట్ల..
పోర్ట్ ల్యాండ్, ఓరెగాన్లోనూ దుండగులు కాల్పులుకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగిందని చెప్పారు.
పోర్ట్‌ల్యాండ్‌లో ఈ ఏడాదిలో 570 సార్లు కాల్పులు జరగగా.. 51 మంది చనిపోయారు. అయితే.. ఈ కాల్పుల్లో సగం వరకు గ్యాంగుల మధ్య గొడవలేనని అధికారులు తెలిపారు.
60 వేల డాలర్ల రివార్డు
వాషింగ్టన్లో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో.. ఓ ఆరేళ్ల బాలిక మృతి చెందింది. మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు కూతవేటు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే.. పోలీసులు స్పందించేలోపు దుండగులు కాల్పులకు తెగబడి పరారయ్యారు.
గాయపడ్డ బాలికను వెంటనే పోలీసులు తమ కారులో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. నిందితులను గుర్తించి సమాచారం అందించినవారికి 60 వేల డాలర్ల రివార్డు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు.. నిందితులకోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: రసాయన వాయువు లీక్- స్థానికులకు అస్వస్థత
ఇదీ చూడండి: పాక్‌లోని అఫ్గాన్ రాయబారి కూతురిపై దాడి