భారత్ సహా చుట్టుపక్కల దేశాలపై చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరి... కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డ్రాగన్ సామ్రాజ్య విస్తరణవాదంతో ఇరుగుపొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
తూర్పు లద్దాఖ్‌లో భారత్- చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని శ్వేతసౌధం తెలిపింది. ఇరుదేశాలు సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే అమెరికా అభిమతమని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ అన్నారు.
"తూర్పు లద్దాఖ్‌లో చైనా దూకుడు... వారి దురాక్రమణ వాదాన్ని బట్టబయలు చేస్తోందని.. ఇదే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిజస్వరూపమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు."
- కైలీ మెక్ఎనానీ, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ
సరిహద్దు ఉద్రిక్తతలు
జూన్ 15న గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. దీనితో గత రెండు వారాలుగా తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారత్- చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ఇరుదేశాలు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి.
ఇంతకు ముందు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా... వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడుపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రెమిడెసివిర్ ఔషధం మొత్తం అమెరికాకే..!