భారత్‌లో అనేక భారీ ఆనకట్టలకు కాలం చెల్లుతోందని ఐరాస నివేదిక హెచ్చరించింది. 2025 నాటికి దేశంలో వెయ్యికి పైగా ఆనకట్టలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాయని నివేదిక తెలిపింది. 'ఏజింగ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్' పేరుతో ఐరాస విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కెనాడాలోని జల, పర్యావరణ, ఆరోగ్య సంస్థ ఈ నివేదికను రూపొందించింది.
భారత్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, కెనడా వంటి దేశాల్లోని ఆనకట్టలపై అధ్యయనం జరిపిన పరిశోధకుల బృందం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత జలాశయాల వల్ల పెనుముప్పు పొంచి ఉందని నివేదిక హెచ్చరించింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో అధికశాతం.. 20వ శతాబ్దంలో నిర్మించిన ఆనకట్టలకు దిగువున ఉంటారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన 58వేల 700 భారీ డ్యామ్‌లలో అధిక భాగం 1930-1970 మధ్య నిర్మించినవేనని.. వాటిని 50 నుంచి 100 ఏళ్ల వరకూ మన్నేలా నిర్మించినట్లు నివేదిక పేర్కొంది. 50ఏళ్లు నిండిన తరువాత భారీ కాంక్రీటు ఆనకట్టల్లో సమస్యలు మెుదలవుతాయని తెలిపింది.
ఇదీ చదవండి: ''రైతులపై కుట్ర' ఆరోపణలకు ఆధారాల్లేవ్'