Joint Base Andrews: అమెరికాలోని అధ్యక్షుడు సహా ఉన్నతాధికారులకు సేవలు అందించే వైమానిక స్థావరం.. జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద భద్రతా కారణాల వల్ల లాక్డౌన్ విధించారు అధికారులు. ఎయిర్‌బేస్ వద్ద గుర్తుతెలియని ఓ సాయుధుడిని అధికారులు గుర్తించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఆమె భర్త డౌగ్ ఎంహోఫ్తో కలిసి అక్కడి నుంచి నావల్ అబ్జర్వేటరీకి ప్రయాణమైన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది.
కమలా హారిస్ వెంట వచ్చిన కేబినెట్ సెక్రటరీలను కూడా ఘటనాస్థలం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 'జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఏం జరుగుతోంది అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఘటనాస్థలంలో ఓ సాయుధుడిని గుర్తించామని.. అయితే ఎలాంటి కాల్పులు జరగలేదని మా వాహనాన్ని తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది చెప్పారు' అని శ్వేతసౌధం సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చూడండి : ఆగని బాంబుల మోత.. ఉక్రెయిన్ను కమ్మేస్తున్న రష్యా సేనలు