కరోనా తాకిడికి ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆసియా వెలుపల ఈ వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. తూర్పు ఆఫ్రికాకూ ఈ మహమ్మారి పాకింది. కెన్యా, ఇథియోపియాల్లో తొలి కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా జనజీవనంపై పెను ప్రభావం చూపుతోంది. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వైరస్ వ్యాప్తి జోరుకు బెంబేలెత్తుతున్న ప్రపంచ దేశాలు... యుద్ధ సమయాల్లోనే తీసుకునే చర్యలను అమలు చేస్తున్నాయి. సరిహద్దులను మూసేయడం, పాఠశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రజలు గుమికూడే అన్ని కార్యక్రమాలను రద్దు చేయడం వంటివి ఇందులో ఉంటున్నాయి.
కరోనా వైరస్‌తో మరణించినవారి సంఖ్య శుక్రవారం నాటికి 5వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. ఐరోపా, ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇటలీలో మరణాలు 1,266కు చేరాయి. శుక్రవారం ఒక్కరోజులోనే 250 మంది మరణించారు. ఇరాన్‌లో కేసుల సంఖ్య 11వేలు, మరణాలు 500 దాటాయి. వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా పౌరులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సైన్యం రంగంలోకి దిగింది.
ఆగిన ఎన్నికల ప్రచారం
అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా వైరస్ ప్రభావం పడింది. అధ్యక్షుడు ట్రంప్, ఆయన రాజకీయ ప్రత్యర్థులైన డెమోక్రాటిక్ పార్టీ నేతలు జో బైడెన్, బెర్నీ శాండర్స్ ప్రచార సభలను రద్దు చేసుకున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య 1,660కు చేరింది. అనేక సాంస్కృతిక కేంద్రాలను మూసేశారు. డిస్నీ ల్యాండ్, డిస్నీ వరల్డ్‌ను మూసేశారు.
ప్రముఖులకూ తప్పలేదు
తాజాగా ఆస్ట్రేలియా హోం మంత్రి పీటర్ డుటన్‌కూ కరోనా సోకింది. ఆయనను ఒక ఆసుపత్రిలో విడిగా ఉంచారు. కొద్ది రోజుల కిందట ఆయన అమెరికా వెళ్లి, ట్రంప్ కుమార్తె ఇవాంక, అటార్నీ జనరల్ విలియమ్ బార్‌తో సమావేశమై వచ్చారు. ఇటీవల ట్రంప్‌తో భేటీ అయిన బ్రెజిల్ అధ్యక్షుడి కమ్యూనికేషన్ల డైరెక్టర్‌కూ ఈ వైరస్ సోకింది. అయినా తాను ఇప్పటికిప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పారు. కెనడా ప్రధాని ట్రూడో భార్య సోఫీకి కరోనా నిర్ధారణ అయింది. బ్రెజిల్, ఫిలిప్పీన్స్‌లోని అనేక మంది నేతల పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది. ఇరాన్ అగ్రనాయకుడు అయతొల్లా అలీ ఖమైనీకి అత్యంత సన్నిహిత సలహాదారు అయిన అలీ అక్బర్, ఆ దేశ సీనియర్ ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులకూ ఈ వైరస్ సోకింది.
ఫ్రాన్స్ విలవిల
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను శుక్రవారం నుంచి మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో కరోనాతో 79 మంది చనిపోగా, మరో 3,661 మంది ఈ అంటువ్యాధితో బాధపడుతున్నారు.
బడులకు తాళం
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కనీసం రెండు వారాల పాటు బడులను మూసేయాలని నిర్ణయించారు. ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే, లిథువేనియా, అల్జీరియా, స్లొవేకియాల్లో చాలావరకూ పాఠశాలలను మూసివేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ప్రయాణ నిషేధాలతో అనేక మంది వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు.
ఇదీ చూడండి: కరోనాకు కేంద్ర బిందువుగా ఐరోపా: డబ్ల్యూహెచ్ఓ