ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. కొంతమంది చేతులు వెనక్కి పెట్టి రోడ్డు మీద పడుకొని, మరికొందరు ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపారు. బాణసంచా కాల్చి వినూత్నంగా ఆందోళనలు చేశారు. 338 మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆందోళనకారుడ్ని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు.
దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా అమెరికా వ్యాప్తంగా 140కి పైగా నగరాల్లో నిరసనలు జరుగుతుండగా... అలర్లు హింసాత్మకంగా మారిన 40 నగరాల్లో కర్ఫ్యూ అమలవుతోంది.
'సైన్యాన్ని దించుతా'
శ్వేతసౌధం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల సోమవారం బంకర్లోకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్... రాష్ట్రాల గవర్నర్లపై మండిపడ్డారు. ఘర్షణలు తెరదించేందుకు నేషనల్‌గార్డ్స్‌ను బరిలోకి దింపకుంటే, ప్రెసిడెంట్ లా ఆర్డర్‌ను విధించి సాయుధ సైనికుల్ని దించుతానని హెచ్చరించారు ట్రంప్.
"జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి న్యాయం చేసేందుకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. దేశంలో జరుగుతున్న అల్లర్లకు పేదవర్గాల్లోని శాంతికాముకులు బాధితులుగా మారుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా వారిని సురక్షితంగా ఉంచేందుకు నేను పోరాడతాను. లింకన్ మెమోరియల్, రెండో ప్రపంచ యుద్ధ మెమోరియళ్లను ధ్వంసం చేశారు. ఇవి శాంతియుత నిరసనలు కాదు. స్థానిక ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తే, ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు అమెరికా సైన్యాన్ని మోహరించి సమస్యను త్వరగా పరిష్కరిస్తాను."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
పలు నగరాల్లో ఘర్షణలు..
ఆంక్షలు కూడా లెక్కచేయకుండా రోడ్లపైకి వేలాదిగా వస్తున్న నిరసనకారులు 'ఐ కాంట్ బ్రీత్' అంటూ నినదిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. వీరిని నియంత్రించే క్రమంలో న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలస్ తదితర నగరాల్లో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు.
శవ పరీక్షలో నిగ్గుతేలిన నిజాలు
ఫ్లాయిడ్ మృతిపై అగ్రరాజ్యం అట్టుడుకుతున్న సమయంలో కీలకమైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. ఫ్లాయిడ్ మెడపై బలమైన ఒత్తిడి వల్లే చనిపోయాడని... ఇది నరహత్య అని మినియాపొలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధరించారు. పోలీసుల అదుపులో ఉండగా ప్లాయిడ్ గుండెపోటుకు గురైనట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఇటు ఫ్లాయిడ్ మెడపై మోకాలితో నొక్కిపట్టడం వల్లే ఊపిరి సలపక చనిపోయాడని అతడి కుటుంబం చేయించిన శవపరీక్ష నివేదికలోనూ వెల్లడైంది.
శాంతియతంగా..
అఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్రాయిడ్ హత్య నేపథ్యంలో అమెరికాలో హింసాత్మకంగా మారిన అల్లర్లపై ఐరాస స్పందించింది. న్యాయంకోసం పోరుబాట పట్టిన అమెరికన్లు తమ డిమాండ్లను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ సూచించారు. అల్లర్లను అదుపు చేసే క్రమంలో అధికార వర్గాలు కూడా సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
ఇదీ చూడండి: ట్రంప్ నోరు మూసుకుంటే మంచిది: పోలీస్ బాస్