కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆ ఇన్ఫెక్షన్ నుంచి 96శాతం రక్షణ లభిస్తోందని.. ఒకవేళ కరోనా సోకినా, ఇన్ఫెక్షన్ తీవ్రత స్వల్పంగానే ఉంటోందని తాజా పరిశోధనల్లో రూఢి అయింది. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వేయించుకున్న తమ సిబ్బందిపై సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్ రీసెర్చ్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం సాగించారు. గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ.. మొత్తం 5,217 మంది ఈ క్రతువులో పాలుపంచుకున్నారు. వీరిలో 58 శాతం మంది ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా తీసుకున్నావారు ఉన్నారు.
అధ్యయన సమయంలో మొత్తం 236 మంది కొవిడ్‌కు గురి కాగా, వారిలో 185 మంది ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారు. 'వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా.. లక్షణాలు కనిపించే, కనిపించని ఇన్ఫెక్షన్ల తీవ్రత సగటున 79 శాతం తక్కువగా ఉంటున్నాయి. రెండో డోసు తీసుకున్న తరువాత కనీసం వారం రోజులకు కొవిడ్ నుంచి 96శాతం రక్షణ లభిస్తోంది. టీకా వేయించుకున్న వారి నుంచి ఇతరులకు కొవిడ్ సోకే ముప్పు కూడా తక్కువే. దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉంది.' అని శాస్త్రవేత్త డీగో హిజానో తెలిపారు. ఆమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ఈ వివరాలను అందించంది.
ఇదీ చూడండి: చైనా సినోఫామ్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి