ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ ఎంతటి ప్రభావం చూపించిందనేది తెలిపే విధంగా మరో నివేదిక ఒకటి బయటకు వచ్చింది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 90శాతం దేశాల ఆరోగ్య సేవల్లో జాప్యం ఏర్పడిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ నివేదిక పేర్కొంది. ఇందులో కుటుంబ నియంత్రణ, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, కేన్సర్ నిర్ధరణ, చికిత్సలు ఉన్నాయని వెల్లడించింది.
"ముఖ్యంగా, లాక్డౌన్లు, సరఫరా కొరత, సిబ్బందిని మరొక చోటుకు తరలించడం సహా ఇతర పరిస్థితుల వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించే కార్యకలాపాలు నిలిచిపోయాయి. పోలియో నిర్మూలనపైనా దీని ప్రభావం పడింది. వీటన్నిటితో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగాయి. మిలియన్ల మందిలో ఆహార భద్రతపై భయం పెరిగింది."
--- ఐరాస నివేదిక.
విస్తృతంగా పాటిస్తున్న అసమానతలు, ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండకపోవడం, విద్య, సామాజిక రక్షణ లేకపోవడం వంటి సమస్యలకు సంక్షోభ సమయంలో అనిశ్చితి తోడవడం వల్ల పరిస్థితులు ఇంకా దారుణంగా మారాయని ఐరాస నివేదిక అభిప్రాయపడింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో 70శాతం సిబ్బంది మహిళలేనని తెలిపిన నివేదిక.. వీరికి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. మరోవైపు సంక్షోభ సమయంలో చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- కరోనా కొత్త రకంతో బ్రిటన్ అతలాకుతలం