హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగ అనుమతులను పునరుద్ధరించాలని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను కోరారు అగ్రరాజ్యంలోని చట్ట సభ్యులు. ఈ మేరకు 60 మంది చట్ట సభ్యులు బైడెన్‌కు లేఖను అందించారు. ప్రస్తుత కరోనా సమయంలో హెచ్-4 వీసాలున్న మహిళా ఉద్యోగులు అత్యవసర విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. పరిశోధన, ఫార్మా కంపెనీలలోనూ ఉద్యోగులు సేవలందిస్తున్నారని లేఖలో వివరించారు. ట్రంప్ విధించిన ఆంక్షలతో ప్రస్తుతం హెచ్4 మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని బైడెన్‌కు అందించిన లేఖలో ప్రతినిధులు పేర్కొన్నారు.
హెచ్-4 వీసాలను అమెరికాలో స్థిరపడ్డ హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు, పిల్లలకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ(యూఎస్సీఐఎస్) జారీచేస్తుంది. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు అగ్రరాజ్యంలో ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలుగా హెచ్-4 వీసాలను 2015 లో హోంశాఖ జారీ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే డొనాల్డ్ ట్రంప్.. ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికన్ కోర్టుకు తెలిపారు.
డిసెంబర్ 17 వరకు 1,26,853 హెచ్-4 దరఖాస్తులను ఆమోదించింది అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ శాఖ. 2018 రిపోర్టు ప్రకారం హెచ్-4 వీసాలు కలిగిన వారిలో దాదాపు 93 శాతం మంది భారత్‌లో జన్మించిన వారేనని తేలింది.
ఇదీ చదవండి : సొంతింటికి వెళ్లేందుకూ ట్రంప్‌కు ఇక్కట్లు!