అమెరికాలో నిరుద్యోగం గతంతో పోల్చితే ఐదు రెట్లు పెరిగిపోయింది. కరోనాతో అగ్రరాజ్యం షట్‌డౌన్‌లోకి పోవడం, దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యమే ఇందుకు కారణం.
గత వారం దాదాపు 3.3 మిలియన్ల మంది అమెరికన్లు నిరుద్యోగ (భృతి) ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 1982 తరువాత అమెరికాలో ఇంతగా నిరుద్యోగం పెరిగిపోవడం ఇదే మొదటిసారి.
ఊడుతున్న ఉద్యోగాలు
కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, విమానయాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. వాహనాల అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయా ఫ్యాక్టరీలు మూసివేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు డబ్బు ఆదా చేసేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫలితంగా అగ్రదేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది.
మరింత కనిష్ఠానికి...
2009లో ముగిసిన గ్రేట్ రెసిషన్(ఆర్థిక మాంద్యం) నాటికి అమెరికాలో నిరుద్యోగం 10 శాతంగా ఉంది. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో... మే నాటికి అమెరికా నిరుద్యోగిత రేటు 13 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"రెండు వారాల క్రితం అసాధ్యం అనిపించింది... ఇప్పుడు నిజమైంది."
- నాన్సీ వాండెన్ హౌటెన్, కన్సల్టింగ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త
భారీగా నష్టపోతుందా?
ఈ ఫిబ్రవరి నాటికి, దేశ నిరుద్యోగిత రేటు 50 ఏళ్ల కనిష్ఠ స్థాయి 3.5 శాతంగా ఉంది. అయితే కరోనా ధాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోయి... 30 శాతానికి పడిపోతుందని', కొంత మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాపై కలిసికట్టుగా పోరాడుదాం: జీ-20 దేశాల ప్రతిజ్ఞ