ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. వారం రోజుల ముందే రాజధాని వాషింగ్టన్ ఆంక్షల వలయంలోకి జారుకుంది. నగరంలో బుధవారమే లాక్డౌన్ విధించారు. ప్రమాణస్వీకార మహోత్సవం జరిగే క్యాపిటల్ వద్ద భారీస్థాయిలో కంచెలు నిర్మిస్తున్నారు. వాహనాలకు అనుమతులివ్వడం లేదు.
ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకునేందుకు 20వేల మంది నేషనల్ గార్డ్స్‌ను ఆయుధాలతో క్యాపిటల్ చుట్టూ మోహరిస్తోంది అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్. ఇప్పటికే 15 వేల మంది క్యాపిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ నెల 20లోపు మరో 5వేల మంది వేదిక ప్రాంగణం వద్దకు చేరుకుంటారు.
క్యాపిటల్ ఎఫెక్ట్..
ఇంతటి భారీ స్థాయిలో బలగాలను మోహరించడానికి ముఖ్య కారణం.. ఈ నెల 6న క్యాపిటల్ భవనం వద్ద జరిగిన హింసాకాండ. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన వేలాది మంది మద్దతుదారులు.. క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో.. బైడెన్ ప్రమాణస్వీకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇదీ చూడండి:- 'బైడెన్ ప్రమాణస్వీకారం రోజు అమెరికాలో అల్లర్లు!'
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకూడదని చూసుకోవాలని భావిస్తున్నారు. ఫలితంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాపిటల్ చుట్టూ.. ఇప్పటికే మెటల్ డిటెక్టర్లతో పాటు మెటల్ వాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
సర్వత్రా ఆందోళన..
క్యాపిటల్ భవనంలో జరిగిన హింస.. చట్టసభ్యులపై భారీ ప్రభావం చూపించింది. అనేక మందిలో తీవ్ర అనిశ్చితి నెలకొన్నట్టు సమాచారం. బయట వేడుకకు మద్దతిస్తూనే.. లోపల తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఏది ఏమైనా.. తాను భయపడనని, ఆనవాయితీ ప్రకారం బహిరంగంగానే ప్రమాణస్వీకారం చేస్తానని తేల్చిచెప్పారు బైడెన్. భద్రతా ఏర్పాట్లపై తనకు సమాచారం అందిందని వెల్లడించారు.
ఇదీ చూడండి:- ట్రంప్ తీరుతో రిపబ్లికన్ పార్టీలో చీలికలు!