ప్రపంచంలో 220 కోట్ల మంది కంటి చూపులో లోపం లేదా, పూర్తి అంధత్వంతో పడుతున్నారు. దూరపు చూపు, దగ్గరి చూపులో ఇబ్బందులు, గ్లౌకోమా, కాటరాక్ట్ సమస్యలకు వారికి సరైన చికిత్స అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కంటి చూపుపై రూపొందించిన మొదటి నివేదికలో ఈ వివరాలు పొందుపరిచింది ఆ సంస్థ.
8 దేశాల్లో ట్రకోమా సమస్యను పూర్తిగా రూపుమాపడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. అయితే... అంతకుమించిన ముప్పులు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.
మన కంట బాధ ఎందుకంట?
జీవనశైలిలో మార్పులు కంటిపై ప్రభావం చూపుతున్నాయి. మారుతున్న ఆహార అలవాట్లు, గంటల తరబడి టీవీ, మొబైల్, కంప్యూటర్ తెరలకు అతుక్కుపోవడం వల్ల కంటి నరాలపై ఒత్తిడి ఏర్పడుతోంది.
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం.. పట్టణీకరణ, వలసలు కంటి సమస్యలకు మరో కారణంగా తెలుస్తోంది. నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల కంటిలో సూక్ష్మ వ్యర్థాలు చేరుతున్నాయి. ఈ సమస్య గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అదే స్థాయిలో ఉన్నా పరీక్ష చేయించుకునేందుకు ముందుకు రావడంలేదు.
⦁ పిల్లల కళ్లకూ ముప్పే
బడి, ఇల్లు అంటూ నిర్బంధ జీవితం గడపడం వల్ల మైయోపియాతో బాధపడే పిల్లల సంఖ్య క్రమంగా పెరిగిపోతుందని సర్వేలో తేలింది. ఎక్కువ సమయం నీడపట్టున ఉండేవారు, బయట తిరిగేవారి కంటి చూపులపై చైనాలో పరిశోధన చేశారు. నీడపట్టున ఉండి దగ్గర నుంచి కంప్యూటర్, ట్యాబ్‌లలో వీడియోలు చూసేవారిలో ఎక్కువ కంటి సమస్యలు వస్తున్నట్లు వెల్లడైంది.
చికిత్స లేకుంటే ఎలా?
ప్రపంచంలో కంటి సమస్య ఆందోళనకర స్థాయిలో ఉన్నా ప్రజలు మేల్కొని తగు చికిత్స తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కంటి సమస్య నయమయ్యే అవకాశమున్నా 100కోట్ల మందికిపైగా సరైన చికిత్స తీసుకోవడంలేదని వివరించింది. సమస్య తీవ్రతను అంచనా వేయలేకపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. 80 కోట్ల మంది కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుందని చికిత్సకు నిరాకరిస్తున్నాట్లు తెలిపింది.
యువత కంటి చూపు ప్రమాదంలో ఉందని డబ్ల్యూహెచ్ఓ కార్యదర్శి అలర్కోస్ తెలిపారు. రానున్న దశాబ్ద కాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. ప్రతి దేశం తమ జాతీయ ఆరోగ్య ప్రణాళికలో కంటి చికిత్సలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇదీ చూడండి:పోలీసు అధికారి భుజాలెక్కి పేలు చూసిన వానరం!