మనుషులపై ఉప్పెనలా విరుచుకుపడ్డ కరోనా ధాటికి ఇప్పటికే అమెరికా విలవిల్లాడుతుండగా... తాజాగా పిల్లులకూ వైరస్ సోకింది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో రెండు పిల్లులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రాగా.. దేశంలో మొదటిసారిగా జంతువులకూ వైరస్ సోకిందని అధికారులు నిర్ధరించారు. ఈ రెండూ వేర్వేరు ప్రాంతాల్లో బయటపడటం గమనార్హం.
స్వల్ప శ్వాసకోశ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆ పిల్లులకు టెస్టులు నిర్వహించి.. కొవిడ్ సోకినట్లు అధికారులు గుర్తించారు. తమ ఇళ్లు, పరిసరాల్లో ఇతరుల నుంచి వైరస్ సోకి ఉంటుందని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ), యూఎస్ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీస్(ఎన్వీఎస్ఎల్)లు వెల్లడించాయి.
కొన్ని జంతువులకు.. మనుషుల నుంచి వైరస్ సోకుతుందని అధికారులు అన్నారు. కానీ జంతువుల ద్వారా అది తిరిగి మానవులకు సంక్రమించే అవకాశం లేదని.. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.
'కొవిడ్ పరీక్షలు సిఫార్సు చేయలేం'
కరోనా వైరస్ మనుషుల నుంచి జంతువులకు సోకుతుందని ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ నేపథ్యంలో జంతువులకు కొవిడ్ పరీక్షలను సిఫార్సు చేయలేమని యూఎస్డీఏ అధికారి జేన్ రూనీ తెలిపారు.
ఇటీవలే బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలలో కొన్ని పులులు, సింహాల్లో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
ఇదీ చదవండి: ఆ విషయంలో పారని ట్రంప్ పాచిక